హాలీవుడ్‌లో కూడా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రభంజనం

రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ హీరోలుగా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా హాలీవుడ్‌లో కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ రాజమౌళికి ఉత్తమ దర్శకుడిగా అవార్డు ప్రకటించగా తాజాగా మరో రెండు అవార్డులు ఆర్ఆర్ఆర్‌కి లభించాయి. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రకటించిన స్పాట్ లైట్ విన్నర్‌ అవార్డులను, అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డులను గెలుచుకొంది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రకటించిన అవార్డులలో ఉత్తమ నటులు, సాంకేతిక నిపుణుల విభాగంలో అవార్డులు గెలుచుకోగా, అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ నుంచి ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా అవార్డుని గెలుచుకొంది. ఇవి కాక సన్ సెట్ సర్కిల్, శాటర్న్ అవార్డులు కూడా గెలుచుకొంది.

ఆర్ఆర్ఆర్ సినిమాని జపనీస్ భాషలో డబ్ చేసి విడుదల చేయగా అక్కడా దానికి మంచి ఆదరణ లభిస్తోంది. మంచి కలక్షన్స్‌ రాబడుతోంది. దేశవిదేశాలలో ఇంతగా ఆదరణ పొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాని భారత్‌ తరపున ఆస్కార్ నామినేషన్స్ కొరకు పంపించాల్సి ఉండగా భారత్‌ ఆస్కార్ నామినేషన్స్ కమిటీ ఈ సినిమాని పక్కన పెట్టి గుజరాతీ సినిమా చెల్లో షో (ది లాస్ట్ షో)ని పంపించింది. కనుక రాజమౌళి ఆర్ఆర్ఆర్‌ని ఆస్కార్ అవార్డులకు పరిశీలించవలసిందిగా కోరుతూ ఆస్కార్ నామినేషన్స్ కమిటీకే నేరుగా దరఖాస్తు చేసుకొన్నారు. హాలీవుడ్‌లో కూడా ఇన్ని ప్రశంశలు, అవార్డులు అందుకొంటున్న ఆర్ఆర్ఆర్ సినిమా తప్పకుండా ఆస్కార్ అవార్డులను గెలుచుకొనే అవకాశాలున్నాయి.