దెయ్యంతో నయనతార కనెక్ట్!

తెలుగులో నయనతార నటించిన చివరి చిత్రం మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్‌. ఆ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నటించింది నయనతార. అయితే ఆ సినిమా ఆశించినంతగా ఆడలేదు. కానీ ఎప్పటిలాగే సినిమాలో నయనతార నటనకి మంచిమార్కులే పడ్డాయి. దాని తర్వాత ఆమె నటించిన కనెక్ట్ సినిమా ఈ నెల 22వ తేదీన విడుదల కాబోతోంది. అశ్విన్ శరణన్ దర్శకత్వంలో ఆమె భర్త విగ్నేష్ శివన్ నిర్మాతగా రౌడీ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అనుపమ్ ఖేర్, సత్యరాజ్, వినయ్, నఫీసా హనీయ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమా ప్రమోషన్స్‌ కొరకు ఈ చిత్ర బృందం సోమవారం హైదరాబాద్‌ వచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు అశ్విన్ శరణన్ మాట్లాడుతూ, “నిజానికి ఈ సినిమా కధని నేను నయనతారని దృష్టిలో పెట్టుకొని రాయలేదు. కానీ కధ సిద్దమైన తర్వాత ఆమె చేస్తే బాగుంటుందని విగ్నేష్ శివన్‌ని కలిసి కధ వినిపిస్తే ఆమెతో తమ సొంత బ్యానర్‌లోనే తీద్దామని చెప్పి తీశారు. ఇది కూడా హర్రర్ చిత్రమే కానీ ఆ జోనర్‌లో నేను తీసిన సినిమాలకి పూర్తి భిన్నంగా సాగుతుంది ఈ కనెక్ట్ సినిమా. లాక్‌డౌన్‌ సమయంలో వేరే ప్రాంతంలో ఉన్న కుమార్తెకి దెయ్యం పట్టి పీడిస్తుంటే దానిని ఆమె తల్లి వీడియో కాలింగ్ ద్వారా ఏవిదంగా వదిలించింది? అనే సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాని తీశాము. ఇది తప్పకుండా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొంటుందని భావిస్తున్నాను,” అని అన్నారు.