అమెజాన్ ప్రైమ్‌లో యశోద! రిలీజ్‌ ఎప్పుడంటే...

హరి-హరీష్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీగా విడుదలైన ‘యశోద’ సినిమా మంచి పాజిటివ్ టాక్‌, మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై నెలరోజులు పూర్తయినందున డిసెంబర్‌ 9వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కాబోతున్నట్లు తాజా సమాచారం. 

సరోగసీ (అద్దె గర్భం) పేరుతో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్‌లో జరుగుతున్న చీకటి వ్యాపారాలను కధాంశంగా తీసుకొని యశోదని తెరకెక్కించారు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. ఈ సినిమాలో రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, శత్రు, మధురిమా, దివ్యా శ్రీపాద, కల్పిక గణేశ్, ప్రియయాంక శర్మ, రాజీవ్ కుమార్‌ అనేజా ముఖ్యపాత్రలు చేశారు. యశోద తెలుగు వెర్షన్‌కు మణిశర్మ సంగీతం, ఎం.సుకుమార్ కెమెరా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, డా.చల్లా భాగ్యలక్ష్మి, చిన్న నారాయణ మాటలు, రామజోగయ్య శాస్త్రి పాటలు అందించారు.

ఈ సినిమా చేస్తున్న సమయంలోనే సమంత మయో సైటీస్ అనే వ్యాధికి గురైంది. దాంతో బాధపడుతూనే సమంత ఈ సినిమాని పట్టుదలగా పూర్తి చేసింది. ఈ వ్యాధి చికిత్స కొరకు సమంతని ఆమె తల్లితండ్రులు అమెరికా తీసుకువెళ్ళారు కానీ అక్కడా దానికి ఆధునిక చికిత్స అందుబాటులో లేకపోవడంతో వారు ఆమెని దక్షిణకొరియాకి తీసుకువెళ్ళి ఆయుర్వేద చికిత్స చేయిస్తున్నట్లు సమాచారం. సమంత లేదా ఆమె మేనేజర్, తల్లితండ్రులు, సన్నిహితులు ఎవరూ కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.