నరేష్, పవిత్రా లోకేష్‌ల బందం… అనుబందం గురించి అందరికీ తెలిసిందే. కనుక కాకుల వంటి సోషల్ మీడియా ఊరుకోదు. వాళ్ళ కోసం కాకపోయినా తమ రేటింగ్, ర్యాంకింగ్ పెంచుకోవడానికి మంచి మసాలా న్యూస్ అవసరం కనుక ఉన్నవీ లేనివీ కలిపి రాసి పడేస్తుంటారు. ఇప్పటికే ఇండస్ట్రీలో అందరూ తమ వెనుక ముసిముసినవ్వులు నవ్వుకొంటుంటే ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలు లేదా పుకార్లు పుండు మీద కారం జల్లినట్లే ఉంటాయని వేరే చెప్పక్కరలేదు. కనుక పవిత్రా లోకేష్ శనివారం హైదరాబాద్‌లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు, కొన్ని వెబ్‌సైట్లు, కొన్ని టీవీ ఛానల్స్ పేర్లను ఆమె ఫిర్యాదులో ప్రత్యేకంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. వారు పనిగట్టుకొని తమ జంటపై అనుచిత వ్యాఖ్యలు, కధనాలు ప్రచురిస్తున్నారని, వాటి కోసం తమ ఫోటోలను మార్ఫింగ్ కూడా చేస్తున్నారని పవిత్రా లోకేష్ ఫిర్యాదు చేశారు. కనుక వారిపై చర్యలు తీసుకొని ఈ దుష్ప్రచారాన్ని కట్టడి చేయాలని ఆమె పోలీసులను కోరారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బ్రతికి ఉన్న సెలబ్రేటీలు చనిపోయారని, అన్యోన్యంగా కాపురం చేసుకొంటున్నవారు విడిపోతున్నారంటూ పుకార్లు వ్యాపింపజేస్తుండటంతో సదరు సెలబ్రేటీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్రమ్ గోఖలే (77) శనివారం పూణేలోని దీనానాధ్ మంగేష్కర్ హాస్పిటల్‌లో కన్నుమూయగా ఆయన గురువారమే మరణించారంటూ మీడియాలో పుకార్లు వ్యాపింపజేయడంతో, వారి కుటుంబ సభ్యులు ఎంత ఆవేదనకు గురయ్యి ఉంటారో ఊహించుకోవచ్చు.