ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్రమ్ గోఖలే (77) శనివారం పూణేలోని దీనానాధ్ మంగేష్కర్ హాస్పిటల్లో కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ నెల 5వ తేదీ నుంచి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు.
విక్రమ్ గోఖలే మరాఠీ నాటకాలతో తన ప్రస్థానం ప్రారంభించి మరాఠీ, హిందీ బాషలలో అనేక సినిమాలు చేశారు. ఐశ్వర్యా రాయ్ సూపర్ హిట్ సినిమా హమ్ దిల్సుఖ్నగర్ దే చుకే సనమ్ సినిమాలో ఆమెకు తండ్రిగా నటించారు. ఆయన హిందీ, మరాఠీ భాషలలొ కలిపి అగ్నిపథ్, ఖుదాగవా, ఇన్సాఫ్, భూల్ భులయ్యా, మిషన్ మంగళ్, నట సామ్రాట్, లైఫ్ పార్ట్నర్, అయ్యారే తదితర మొత్తం 97 సినిమాలలో నటించారు. ఇవేకాక సుమారు 15 హిందీ, మరాఠీ టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు. 60వ జాతీయ ఫిల్మ్ అవార్డులలో గోఖలే ఉత్తమ నటుడు అవార్డు అందుకొన్నారు. ఆయన గోఖలే ట్రస్ట్ స్థాపించి అనాధ పిల్లలు, వికలాంగులైన సైనికులకు, వారి పిల్లలకు ఆర్ధిక సాయం అందజేసేవారు. దాని సేవా కార్యక్రమాలలో ఆయన కుటుంబ సభ్యులు కూడా చురుకుగా పాల్గొంటున్నారు. విక్రమ్ ఘోఖలే మృతి పట్ల బాలీవుడ్లో ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.