మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మకమైన అవార్డు

కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మకమైన ఫిల్మ్ పరసనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు-2022ని  ప్రకటించింది. ఆదివారం గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-53లో పాల్గొన్న కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ ప్రకటన చేసి ట్వీట్ కూడా చేశారు.  

నాలుగు దశాబ్ధాలుగా చిత్ర పరిశ్రమలో 150కి పైగా సినిమాలలో నటించిన మెగాస్టార్ చిరంజీవి దేశవ్యాప్తంగా కోట్లాది ప్రేక్షకులను తన నటనతో, ఆట పాటలతో రంజింపజేస్తున్నారు. భారతీయ సినీ పరిశ్రమ 100 సంవత్సరాలు పూర్తిచేసుకొన్న సందర్భంగా ఆయనకు ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుని ప్రకటిస్తున్నామని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. 

ఈ అవార్డు గ్రహీతకు నెమలిబొమ్మ కలిగిన రజిత పతకం, రూ.10 లక్షల నగదు బహుమతి, ఓ ప్రశంశాపత్రం అందజేస్తారు. ఇంతకుముందు బాలీవు నటులు వహీదా రెహమాన్, అమితాబ్ బచ్చన్, హేమమాలిని, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, సలీమ్‌ ఖాన్‌, బిశ్వజిత్‌ ఛటర్జీ, ప్రసూన్‌ జోషి ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకొన్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అందుకోబోతున్నారు. 

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, చిరంజీవి సోదరులు నాగబాబు, పవన్‌ కళ్యాణ్‌, కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమలో ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు.