
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మీ కౌర్ మరికొందరితో కలిసి నిర్మించిన లైగర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో వారు నేటికీ ఆ నష్టాలు, కష్టాల నుంచి తేరుకోలేకపోతున్నారు. తమకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతూ డిస్ట్రిబ్యూటర్లు హైదరాబాద్‌లో పూరీ ఇంటి ముందు ధర్నాకి సిద్దమవడం, అప్పుడు పూరీ వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం వగైరాలు మరో కధ. ఇప్పుడు వారిరువురికీ ఈడీ నోటీసులు పంపడంతో మరో కొత్త సమస్య మొదలైంది.
లైగర్ సినిమాని సుమారు రూ.100 కోట్లు బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తీసినట్లు వారు చెప్పుకొంటున్నప్పటికీ, అంతకు రెట్టింపు పెట్టనిదే ఆ స్థాయిలో తీయడం సాధ్యం కాదని సినీ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. మాజీ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్‌ని కూడా ఈ సినిమాలోకి తీసుకొన్నారు. ఆయన పారితోషికమే చాలా భారీగా ఉంటుంది. కనుక లైగర్ పెట్టుబడులు, పారితోషికాలు, ఆర్ధిక లావాదేవీల గురించి ప్రశ్నించేందుకు ఈడీ పూరీ, ఛార్మీలను నిన్న హైదరాబాద్‌లో తమ కార్యాలయానికి పిలిపించుకొని సుదీర్గంగా ప్రశ్నించింది. నిన్న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈడీ కార్యాలయంలోనే వారున్నారు. కనుక ఈ లైగర్ భూతం వారిని ఇంకా ఎంతకాలం వెంటాడుతుందో తెలీదు.