శ్రేయోభిలాషులకు గమనిక: మేము విడిపోలేదు: స్నేహ

సరైన వేదిక లభించని కారణంగా గుర్తింపుకి నోచుకోని అనేక సృజనాత్మకులకు సోషల్ మీడియా చక్కటి గుర్తింపు తెచ్చిపెట్టింది. వారిలో సెలబ్రేటీలపై పుకార్లు పుట్టించేవారు కూడా ఉన్నారు. కొంతమంది బ్రతికున్నవారిని చంపేస్తుంటే, మరికొందరు ఫలానా హీరోయిన్‌ భర్తతో మనస్పర్ధలు వచ్చి విడిపోతోందని వ్రాసేస్తుంటారు. అటువంటి సందర్భాలలో సదరు సెలబ్రేటీలు హడావుడిగా మీడియా ముందుకు వచ్చి మేము ఇంకా బ్రతికే ఉన్నామనో లేదా చక్కగా కాపురం చేసుకొంటున్నామనో చెప్పుకోవలసి వస్తుంది. నటి స్నేహ పరిస్థితి కూడా ఇప్పుడు అదే. 

తెలుగు సినిమాలలో పక్కింటి అమ్మాయిగా హోమ్లీ పాత్రలు చేసి చేసి విసిగిపోయిన ఆమె 2011లో నటుడు ప్రసన్న కుమార్‌ని వివాహం చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసి హాయిగా కాపురం చేసుకొంటున్నారు. కొంతకాలం క్రితం రామ్ చరణ్‌ హీరోగా వచ్చిన వినయ విదేయ రామ చిత్రంలో స్నేహ నటించింది. 

స్నేహ, ప్రసన్న కుమార్‌ దంపతులకు ఓ కుమారుడు కూడా కలిగాడు. తమ అన్యోన్య కాపురాన్ని అభిమానులకు తెలియజేస్తూ స్నేహ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ ఫోటోలు కూడా పెడుతుంటారు. అయితే ఇటీవల ఆమెకు భర్త ప్రసన్న కుమార్‌కి మద్య మనస్పర్ధలు ఏర్పడ్డాయని, అప్పటి నుంచి స్నేహ కుమారుడిని తీసుకొని వేరే ఇంట్లో ఉంటున్నారని సోషల్ మీడియాలో పుకార్లు పుట్టాయి. ఈ విషయం ఆమె దృష్టికి రావడంతో భర్తతో తీసుకొన్న తాజా ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తాము కలిసే ఉన్నామని, డైవోర్స్ తీసుకోవడం లేదని చెప్పకనే చెప్పారు.