వాల్తేర్ వీరయ్యతో ఊర్వశి ఐటెమ్ సాంగ్... కన్ఫర్మ్ చేసేశారుగా!

మెగాస్టార్ చిరంజీవి-కెఎస్ రవీంద్ర (బాబీ) కాంబినేషన్‌లో వస్తున్న వాల్తేర్ వీరయ్య సినిమాకి సంబందించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేల చిరంజీవితో కలిసి ఓ ఐటెమ్ సాంగ్ చేయబోతోంది. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు కానీ మొన్న దర్శకుడు మెహర్ రమేష్ పుట్టిన రోజు సందర్భంగా వాల్తేర్  వీరయ్య సెట్‌లో యూనిట్ మెంబర్స్ అందరి సమక్షంలో ఆయన చేత చిరంజీవి కేక్ కట్ చేయించినప్పుడు, వారి వెనుక ఊర్వశి రౌతేల కూడా కనిపించింది. ఆమె బోయపాటి-రామ్ పోతినేని సినిమాలో ఐటెమ్ సాంగ్ చేయబోతోంది కనుక వాల్తేర్ వీరయ్యతో కూడా ఐటెమ్ సాంగ్ చేయడం ఖాయమే అని టాక్.     

దీపావళి సందర్భంగా విడుదల చేసిన వాల్తేర్ వీరయ్య టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది. వాల్తేర్ వీరయ్యలో చిరంజీవికి జోడీగా శ్రుతీ హాసన్ నటిస్తోంది. మాస్ మహారాజ రవితేజ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమాకు బాబీ కధ, డైలాగ్స్ అందించగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. 

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి కెమెరా: ఆర్దర్ ఏ విల్సన్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. వాల్తేర్ వీరయ్య 2023 జనవరిలో సంక్రాంతి పండుగకు విడుదల కాబోతోంది.