ఆ దర్శకుడితో రామ్ చరణ్‌ సినిమా అటకెక్కిపోయిందట!

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్‌ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయాలనుకొన్నాడు. కానీ ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టేశాడు. దాంతో గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా అటకెక్కిపోయిందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆర్ఆర్ఆర్‌తో రామ్ చరణ్‌ పాన్ ఇండియా హీరోగా ఎదిగిపోయాడు కనుక ఆ స్థాయికి తగిన సినిమాలు మాత్రమే చేస్తాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

అందుకు తగ్గట్లుగానే గౌతమ్ తిన్ననూరితో సినిమా ప్రస్తుతానికి ఆగిపోయిందని భవిష్యత్‌లో అది తప్పకుండా జరుగుతుందని ఆశిస్తున్నామంటూ రామ్ చరణ్‌ మేనేజర్ శివ చెర్రీ ట్వీట్ ద్వారా తెలియజేశాడు. త్వరలోనే రామ్ చరణ్‌ తదుపరి సినిమాకు సంబందించి వివరాలను తెలియజేస్తామని ట్వీట్ చేశారు. రామ్ చరణ్‌తో సినిమా ఆగిపోవడంతో గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండని కలిసి ఓ స్టోరీ లైన్ చెప్పగా దానికి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. 

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్‌, కీయరా అద్వానీ జంటగా పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇటీవల రాజమండ్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ కూడా జరిగింది. అది పూర్తయ్యే వరకు రామ్ చరణ్‌ మరో సినిమాలో నటించే అవకాశం లేదు కనుక గౌతమ్ తిన్ననూరితో అనుకొన్న సినిమా ఇప్పట్లో లేనట్లే భావించవచ్చు.