ప్రభాస్‌ మూడో ప్రపంచయుద్ధం... 2024లోనే

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్‌ ‘ప్రాజెక్ట్-కె’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమలో ఇంతవరకు ఎవరూ టచ్ చేయని మూడో ప్రపంచయుద్ధం సబ్జకుతో నాగ్ అశ్విన్ ఈ సినిమా చేయబోతున్నాడు. దానికి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్‌ కంటే సరైన హీరో ఎవరుంటారు. సినీ ఇండస్ట్రీలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌కున్న పేరు ప్రతిష్టలు అందరికీ తెలిసిందే. ఆ బ్యానర్‌పై అశ్వినీదత్ ఈ సినిమాను రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. దానిలో చాలా వరకు విఎఫ్‌ఎక్స్‌ కోసమే ఖర్చుచేయబోతున్నట్లు తెలుస్తోంది. అప్పుడే అది హాలీవుడ్ స్థాయిలో నిలుస్తుంది.

ఈ యాక్షన్ ప్యాక్ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్‌ టాప్ హీరోయిన్‌ దీపికా పడుకొనే నటిస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ ముఖ్యపాత్ర చేస్తున్నారు. ప్రాజెక్ట్-కె కెమెరా: డాని సన్‌చెజ్-లోపెజ్, సంగీతం మిక్కీ జె మేయర్ అందిస్తున్నారు.

ఈ సినిమాను 2020, ఫిబ్రవరిలోనే ప్రకటించినప్పటికీ కరోనా కారణంగా వెంటనే షూటింగ్ ప్రారంభించలేకపోయారు. గత ఏడాది జూలైలో రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని ముఖ్యసన్నివేశాలు షూట్ చేశారు. సాధారణ సినిమాలైతే ఒకేసారి 25-30 రోజులు లేదా 30-60 రోజుల చొప్పున షూటింగ్‌ చేస్తుంటారు కనుక 6-7 నెలల్లో పూర్తవుతుంటాయి. కానీ ఈ సినిమా కధాంశం పరంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు, అందుకు తగ్గ సెటింగ్స్ అవసరం కనుక వాటిని సమకూర్చుకొనేందుకు వీలుగా నెలకి 7-8 రోజులు చొప్పున షూట్ చేస్తుండటంతో సినిమా పూర్తవడానికి చాలా సమయం పడుతోంది. వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా షూటింగ్ పూర్తి చేసి 2024, ఏప్రిల్ 10వ తేదీన దీనిని విడుదల చేయాయబోతున్నట్లు దర్శక నిర్మాతలు ఇదివరకే ప్రకటించారు.       

గత నెల 23న ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా అభిమానుల కోసం ఈ ప్రాజెక్ట్-కె నుంచి ఓ ఫస్ట్-లుక్‌ పోస్టర్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.