ఊర్వశివో రాక్షసివో... ట్రైలర్.. కామెడీ ఇరగదీసేశారుగా

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా నవంబర్‌ 4వ తేదీన విడుదల కాబోతోంది. రాకేష్ శశి దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. దానిలో హీరో, హీరోయిన్ల కంటే వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి కామెడీ బాగా హైలైట్ అయ్యింది. “తనేమో కొరియన్ వెబ్‌ సిరీస్‌లాగట్రెండీగా ఉంటే, నువ్వేంట్రా కార్తీకదీపం సీరియల్లో డాక్టర్ బాబు, వంతలక్కలా పేజీలు పేజీలు డైలాగ్స్ చెబుతున్నావ్,” “ఇన్ని ఈఎంఐలు ఉన్నవాడు ఏ అమ్మాయి గురించి ఆలోచించకూడదురా..”  సబ్ టైటిల్స్ లేకపోవడం వలన ఈ ఎపిసోడ్ ఏమిటో అర్దం కావడం లేదు సార్... మీరే కాస్త అడిగి తెలుసుకోండి సార్...” అంటూ వెన్నెల కిషోర్ చెప్పిన డైలాగ్స్, టైమింగ్ అద్భుతంగా ఉన్నాయి. 

“మన రిలేషన్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకుపోదామా...” అంటూ హీరో హీరోయిన్ల రొమాన్స్ సీన్ తర్వాత పోసాని ఎంట్రీ ఇచ్చి “అయినా లైసెన్స్ లేకుండా బండి నడపడం తప్పు కాదా రాజా... అని ప్రశ్నిస్తే దానికి హీరో జవాబుగా “ఈరోజుల్లో లైసెన్స్, ఆర్‌సీ బుక్కు ఎవరడుగుతున్నారా సార్? హెల్మెట్ ఉంటే సరిపోతుంది,” అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పడం తప్పకుండా అందరినీ ఆకట్టుకొంటుంది. 

అలాగే పబ్బులో హీరోయిన్‌కి “కెన్ ఐ బై యు ఏ డ్రింక్...” అంటూ హీరో ఓవర్ యాక్షన్ చేయబోతే “మన్నిద్దరం కలిసేకదా వచ్చాం... ఏదో పబ్బులో తగిలిన ఫిగర్‌ని అడిగినట్లు అడుగుతావేమిటి..” అంటూ హీరోయిన్‌ గడుసుగా జవాబు చెప్పడం, “అయినా పర్లేదు కెన్ ఐ బైయు ఏ డ్రింక్?”అంటూ హీరో అడగడం హాయిగా నవ్వుకొనేలా ఉన్నాయి. 

ట్రైలర్‌ చూస్తే సినిమాలో మంచి రొమాన్స్, కామెడీ ఉన్నట్లు అర్దమవుతోంది. కనుక అల్లు శిరీష్ నెగ్గుకురాలేకపోయినా సినిమాలో కామెడీ, వెన్నెల, సునీల్, పోసాని తదితరులందరూ కలిసి సినిమాను గట్టెకించేయడం ఖాయంగానే ఉంది.  

ఈ సినిమాకు కధ, దర్శకత్వం రాకేష్ శశి, సంగీతం అనూప్ రూబెన్స్ అందించారు. గీతా ఆర్ట్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై దీరాజ్ మొగిలినేని, విజయ్ నిర్మించారు. ఊర్వశివో రాక్షసివో సినిమా నవంబర్‌ 4న విడుదలవుతోంది.