
నరేష్, పవిత్రా లోకేష్ పవిత్ర బందం గురించి అందరికీ తెలిసిందే. పెళ్ళయిన భార్యభర్తలు కూడా అంత చక్కగా కాపురం చేసుకోలేక విడాకులు తీసుకొంటున్నారు. వారిరువురికీ కూడా విడాకుల అనుభవం చాలానే ఉంది. కనుక ఆ కష్టనష్టాలేమిటో వారికీ బాగా తెలుసు. కనుక పెళ్ళి గురించి ఆలోచించకుండా ఒద్దికగా కాపురం చేసుకొంటున్నారు. అయితే సోషల్ మీడియా కాకులు వారు కూడా విడిపోయారంటూ కావుకావుమని అరిచిగోలచేశాయి. కానీ అదంతా ఒట్టి కాకి గోలే తప్ప నిజం కాదంటూ నరేష్, పవిత్రా లోకేష్ ఇద్దరూ కలిసి మీడియా ముందుకు వచ్చారు. తమ బందం ఎంత బలంగా ఉందో తెలియజేసేందుకు నరేష్ పవిత్రా లోకేష్ భుజంపై ఓ చెయ్యేసి మరీ చెప్పాల్సిన నాలుగు ముక్కలు చెప్పేశారు.
ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే, ఇటీవల ఆహా ఓటీటీలో విడుదలైన ‘అందరూ బాగుండాలి... అందులో నేనుండాలి’ సినిమా హిట్ అయినందుకు దానిలో నటించిన నటీనటులకు, బాల నటులకు, దర్శక నిర్మాతలకు అభినందనలు తెలిపారు. ఈ సినిమా గురించి వచ్చిన 41 రివ్యూలను చదివామని, అన్నీ సినిమా గురించి బాగా వ్రాయడం తమకు చాలా సంతోషం కలిగించిందని అన్నారు. మంచి కామెడీ, సబ్జెక్ట్ ఉన్న సినిమా ఇది కనుక ప్రేక్షకులు అందరూ చూసి మా నటీనటులను ఆదరించండని నరేష్, పవిత్రా లోకేష్ హుషారుగా చెప్పారు. సినిమా గురించి వారు చెప్పిన దానికంటే వారిద్దరూ అంత క్లోజ్‌గా ఉండటమే వార్తలలో హైలైట్గానిలుస్తోంది.