ఐదుగురు హీరోలతో నేడే యశోద ట్రైలర్‌ విడుదల

ఓ హీరోయిన్‌ ఓరియంటడ్ చిత్రం పాన్ ఇండియా మూవీగా తీయడం చాలా సాహసమే అని చెప్పవచ్చు. కానీ సమంత మీద నమ్మకంతో   శివలెంక కృష్ణప్రసాద్ ‘యశోద’ చిత్రంతో ఆ సాహసం చేస్తున్నారు. హరి-హరీష్ దర్శకత్వంలో శ్రీదేవీ మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నవంబర్‌ 11న విడుదల కాబోతోంది. కనుక ఈరోజు సాయంత్రం 5.36 గంటలకు ఒకేసారి 5 భాషల్లో యశోద ట్రైలర్‌ విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశేషమేమిటంటే, ఆయా భాషల్లో ఆయా హీరోలు యశోద ట్రైలర్‌ రిలీజ్ చేయబోతున్నారు. 

తెలుగులో విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, మలయాళంలో డుల్కర్ సల్మాన్, కన్నడలో రక్షిత్ శెట్టి, హిందీలో వరుణ్ ధావన్ యశోద ట్రైలర్‌ విడుదల చేయబోతున్నారు. 

యశోదలో రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, శత్రు, మధురిమా, దివ్యా శ్రీపాద, కల్పిక గణేశ్, ప్రియయాంక శర్మ, రాజీవ్ కుమార్‌ అనేజా ముఖ్యపాత్రలు చేశారు. 

థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన యశోద తెలుగు వెర్షన్‌కు మణిశర్మ సంగీతం, ఎం.సుకుమార్ కెమెరా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, డా.చల్లా భాగ్యలక్ష్మి, చిన్న నారాయణ మాటలు, రామజోగయ్య శాస్త్రి పాటలు అందించారు. 

యశోదతో పాటు సమంత గుణశేఖర్ దర్శకత్వంలో మలయాళ నటుడు దేవ్ మోహన్‌తో కలిసి శాకుంతలం చిత్రం కూడా పూర్తి చేసింది. శకుంతల,దుష్యంతుల పౌరాణిక ప్రేమ గాధ ఆధారంగా నిర్మింపబడుతున్న ఈ సినిమాలో సమంత శకుంతలగా నటిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ కుమార్తె అర్హ చిన్నారి భరతుడిగా కనిపించబోతోంది. 

దిల్‌రాజు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ నీలిమ గుణ ఈ సినిమాను గుణా టీం వర్క్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కూడా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుకుగా జరుగుతున్నాయి. వీటి తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా చేయబోతోంది.