జూబ్లీహిల్స్‌ పోలీసులకు దర్శకుడు పూరీ ఫిర్యాదు!

జూబ్లీహిల్స్‌ పోలీసులకు దర్శకుడు పూరీ జగన్నాథ్ బుదవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. లైగర్‌ సినిమా దర్శకత్వం వహించి నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న తనను కార్తికేయ ఎగ్జిబిటర్స్ సంస్థ అధినేత శ్రీనివాస్ ఆడెపు అలియాస్ వరంగల్‌ శ్రీను, మరో ఫైనాన్షియర్‌  జి.శోభన్ బాబు అలియాస్ శోభన్ డబ్బు కోసం బెదిరిస్తున్నారని పూరీ జగన్నాథ్ ఫిర్యాదు చేశారు. 

లైగర్‌ సినిమా కోసం తన సంస్థ పూరీ కనక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారితో ఒప్పందం చేసుకొందని, అయితే వారిరువురూ తమ దిగువ స్థాయిలో డిస్ట్రిబ్యూటర్లకు బకాయిలు చెల్లించకుండా ఎగవేసి, అందుకు తనను బాధ్యుడిగా చూపిస్తూ వారిని రెచ్చగొట్టి హింసకు ప్రేరేపిస్తున్నారని పూరీ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను వారికి డబ్బు చెల్లించకపోవడం వలననే వారు డిస్ట్రిబ్యూటర్లకు బకాయిలు చెల్లించలేకపోతున్నారని అబద్దాలు చెపుతూ వారిని తనకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారని పూరీ ఆరోపించారు. 

 ప్రస్తుతం తాను సినిమా పనుల కొరకు ముంబైలో ఉంటున్నానని, హైదరాబాద్‌, జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో తన భార్య, కుమార్తె, అత్తగారు ఉంటున్నారని, వారికి వరంగల్‌ శ్రీను, శోభన్ వలన ప్రమాదం పొంచి ఉందని కనుక తనకు, తన కుటుంబ సభ్యులకు పోలీస్ రక్షణ కల్పించాలని పూరీ జగన్నాథ్ విజ్ఞప్తి చేశారు. 

లైగర్‌ చెల్లింపులలో వారికి ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించి అక్కడ తేల్చుకోవాలి కానీ ఈవిదంగా డిస్ట్రిబ్యూటర్లను పోగేసి తన ఇంటి ముందు ధర్నా చేయడం సరికాదని, కనుక తనను, తన కుటుంబ సభ్యులను డబ్బు కోసం వేధిస్తూ హింసను ప్రేరేపిస్తున్న వారిరువురిపై చర్యలు తీసుకోవాలని పూరీ జగన్నాథ్ తన ఫిర్యాదులో పోలీసులను కోరారు.