
భారత్ క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దంపతులు ‘ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్’ పేరుతో సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ఈ సంస్థకు ధోనీ భార్య సాక్షి సింగ్ మేనేజింగ్ డైరెక్టరుగా వ్యవహరించబోతున్నారు. ఉత్తరాదికి చెందిన ఈ దంపతులు తమకు ఎంతో పట్టు, అవగాహన, అభిమానులు కలిగి ఉన్నందున మొదటి హిందీలో సినిమా తీస్తారనుకొంటే, తమ బ్యానర్‌పై మొట్టమొదటగా ఓ తమిళ్ సినిమా నిర్మించబోతున్నట్లు ధోనీ దంపతులు స్వయంగా చెప్పారు. తమిళ దర్శకుడు రమేష్ తమిళమణి దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తీయబోతున్నట్లు తెలిపారు. ఆ తర్వాత తెలుగుతో సహా దక్షిణాది భాషలన్నిటిలో వేర్వేరు జోనర్లలో సినిమాలు తీస్తామని ధోనీ దంపతులు తెలిపారు.
ధోనీ భార్య సాక్షి సింగ్ స్వయంగా వ్రాసిన కధతో తమ తొలి సినిమా తీయబోతున్నట్లు దర్శకుడు రమేష్ తమిళమణి చెప్పారు. సినీ పరిశ్రమలోకి కొత్త ఆలోచనలతో ప్రవేశిస్తున్న సాక్షి సింగ్ వ్రాసిన కధ ప్రస్తుతం విడుదలవుతున్న సినిమాలకు భిన్నంగా అందరినీ ఆకట్టుకొనే విదంగా ఉందని చెప్పారు. ధోనీ దంపతులు సినీ పరిశ్రమలో అడుగుపెడుతూ తనకు తొలి అవకాశం ఇవ్వడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కనుక వారు గర్వపడేవిధంగా ఈ సినిమాను తెరకెక్కిస్తానని చెప్పారు. సాక్షి సింగ్ అందించిన కడకు త్వరలోనే సినిమా స్క్రిప్ట్ సిద్దం చేసి వారితో చర్చించి అంతా ఒకే అనుకొన్న తర్వాత ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తానని దర్శకుడు రమేష్ తమిళమణి చెప్పారు. తమ సినిమాకి సంబందించి పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
క్రికెట్‌లో తనకు తిరుగులేదని నిరూపించుకొన్న మహేంద్ర సింగ్ ధోనీ సినీ రంగంలో కూడా రాణిస్తారా?లేక ఈ ప్రయోగంతో చేతులు కాల్చుకొంటారా?అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.