ఆర్ఆర్ఆర్‌కి ప్రతిష్టాత్మకమైన శాటర్న్ అవార్డు

అమెరికాలో హాలీవుడ్ సినిమాలలో అత్యుత్తమైనవాటికి ఇచ్చే శాటర్న్ అవార్డు ఈసారి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్‌ సినిమాకి దక్కింది. ఉత్తమ అంతర్జాతీయ సినిమాల విభాగంలో ఆర్ఆర్ఆర్‌ సినిమాకి ఈ అవార్డు లభించింది. ఇంతకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి-2 సినిమాకి కూడా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది. తన రెండు సినిమాలకు అవార్డులు ఇచ్చి గౌరవించినందుకు రాజమౌళి శాటర్న్ అవార్డుల న్యాయనిర్ణేతల కమిటీకి కృతజ్ఞతలు తెలుపుకొంటూ ఓ వీడియో సందేశం పంపించారు. ప్రస్తుతం తమ ఆర్ఆర్ఆర్‌ సినిమాని జపాన్‌లో విడుదల చేస్తూ దాని ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నందున ఈ అవార్డును స్వయంగా అందుకొనేందుకు రాలేకపోతున్నానని తెలియజేశారు. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును అందుకొన్నవారందరికీ అభినందనలు తెలియజేశారు.

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, గోండుతెగకు చెందిన తెలంగాణ వీరుడు కుమురం భీమ్ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది అనే ఊహాజనితమైన కల్పిత కధతో రామ్ చరణ్‌, జూ.ఎన్టీఆర్‌లు ప్రధాన పాత్రలలో తీసిన ఆర్ఆర్ఆర్‌ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాక ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలలో సూపర్ హిట్ అయ్యింది. సుమారు రూ.4-500 కోట్ల భారీ బడ్జెట్‌తో తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా సుమారు రూ.1200 కోట్లు పైగా కలక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు జపనీస్ భాషలో కూడా డబ్బింగ్ చేసి జపాన్ దేశంలో కూడా విడుదల చేయగా జపాన్ ప్రజలు కూడా దానిని చాలా ఆదరిస్తున్నారు. అంటే ఇంకా ఆర్ఆర్ఆర్ కలక్షన్స్ సునామీ కొనసాగుతూనే ఉందన్న మాట! విదేశీయులను సైతం మెప్పిస్తోంది కనుకనే ఆర్ఆర్ఆర్‌ సినిమాకి ప్రతిష్టాత్మకమైన శాటర్న్ అవార్డు లభించిందని భావించవచ్చు.