ఆచార్యతో ఎదురుదెబ్బ తిన్న మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్‌తో గట్టెక్కారు. దాని తర్వాత ఆయన కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తన 154వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా పేరు నిర్ణయించనందున మెగా154గా పేర్కొంటున్నారు. ఈ దీపావళి పండుగనాడు బాస్ వస్తున్నాడు... మాస్ మూల విరాట్‌కి స్వాగతం పలుకుదాం,” అంటూ ఈ మెగా154 సినిమా టీజర్‌ను ఈనెల 24న ఉదయం 11.07 గంటలకు దీపావళి సందర్భంగా విడుదలచేయబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్లో ప్రకటించింది.
ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా శ్రుతీ హాసన్ నటిస్తోంది. మాస్ మహారాజ రవితేజ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమాకు బాబీ కధ, డైలాగ్స్ అందించగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తుండటం విశేషం. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకి కెమెరా: ఆర్దర్ ఏ విల్సన్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. 2023 జనవరిలో సంక్రాంతి పండుగకు ఈ సినిమా విడుదల కాబోతోంది.