అల్లు అర్జున్‌కి ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

పుష్ప సినిమాతో యావత్ దేశ ప్రజలు తనను గుర్తించేలా చేసుకొన్న మన స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి ప్రతిష్టాత్మకమైన ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్-2022’ అవార్డు అందుకొన్నారు. 

ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ న్యూస్-18 ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుకి అల్లు అర్జున్‌ని ఎంపిక చేసింది. బుదవారం ఢిల్లీలో జరిగిన ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ చేతుల మీదుగా అల్లు అర్జున్‌ ఈ అవార్డు అందుకొన్నారు. 

ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ, నేను గత రెండు దశాబ్ధాలుగా అనేక సినిమాలు చేశాను. వాటిలో కొన్నిటికి అవార్డులు అందుకొన్నాను. కానీ తొలిసారిగా జాతీయస్థాయిలో ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా సంతోషం కలిగించింది,” అని అన్నారు. 

ఒకప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ సినిమాలు దక్షిణాది రాష్ట్రాలకే పరిమితం అయ్యేవి. రాజమౌళి బాహుబలి ఆ సరిహద్దులను చెరిపేశాడు. అప్పటి నుంచి దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా మూవీలుగా దేశవ్యాప్తంగా విడుదలవుతూ మంచి ఆదరణ పొందుతున్నాయి. 

పుష్ప సినిమా భారత్‌లోనే కాక విదేశాలలో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో అల్లు అర్జున్‌ శ్రీవల్లీ... అంటూ చేసిన డాన్స్, ‘తగ్గేదేలే...’ అంటూ చెప్పిన డైలాగ్ విదేశీయులు సైతం అనుకరిస్తూ ఫోటోలు, వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పెడుతున్నారంటే పుష్ప... అంటే ఫ్లవర్ కాదు ఫైర్’ అని స్పష్టమవుతోంది. కనుక ఆ సినిమాలో అల్లు అర్జున్‌ నటనకు ఈ అవార్డు లభించడం సహజమే అనుకోవచ్చు. 

పుష్ప మొదటి భాగంలో ఇరగదీసిన అల్లు అర్జున్‌ మరి పుష్ప-2లో ఇంకెంత రెచ్చిపోతాడో అని అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. పుష్ప-2 రెగ్యులర్ షూటింగ్‌ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కాబోతోంది. వచ్చే ఏడాది వేసవిలో పుష్ప-2 విడుదల కాబోతోంది.