అవన్నీ పుకార్లే... పుష్ప2లో కూడా అతనే: నిర్మాత

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, రష్మిక మందన జంటగా వచ్చిన పుష్ప మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ అవడంతో దాని రెండో భాగంగా వస్తున్న పుష్ప-2 కోసం దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్‌ 1వ తేదీన అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా పుష్ప-2 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని వార్తలు వచ్చాయి కానీ ఈ నెలాఖరు నుంచి మొదలు కాబోతున్నట్లు తాజా సమాచారం.

ఇక పుష్ప-1లో చివరిలో బన్వర్ సింగ్ షెకావత్‌గా ఎంట్రీ ఇచ్చిన మలయాళ నటుడు ఫహాద్ ఫాసిల్ స్థానంలో బాలీవుడ్‌కి చెందిన అర్జున్ కపూర్‌ని తీసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలను చిత్ర నిర్మాత నవీన్ ఎర్నేని అవన్నీ పుక్కర్లే అంటూ కొట్టి పడేశారు. ఫహాద్ ఫాసిల్ వంటి మంచి నటుడిని ఉంచుకొని వేరెవరి కోసం ఎందుకు వెతుకులాట?అని నిర్మాత ప్రశ్నించారు. ఈ సినిమాలో ఆ పాత్రకు ఫహాద్ ఫాసిల్ మాత్రమే పూర్తి న్యాయం చేయగలరనే నమ్మకంతోనే దర్శకుడు సుకుమార్ ఆయనను ఎంపిక చేసుకొన్నారని, ఎట్టి పరిస్థితులలో ఆయనను మార్చే ప్రసక్తే లేదని, ఎవరో ఊసుపోక ఇటువంటి పుకార్లు పుట్టిస్తున్నారని నిర్మాత నవీన్ ఎర్నేని అన్నారు. 

పుష్ప2ని  నవీన్ ఎర్నేని, రవి శంకర్ కలిసి మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. పుష్ప మొదటి భాగానికి అద్భుతమైన సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ పుష్ప-2కి కూడా అందిస్తుండటంతో పాటలపై కూడా చాలా భారీ అంచనాలే ఉన్నాయి.