2.jpg)
మెగాస్టార్ చిరంజీవి అంతటివాడికి కూడా ఒక ఫ్లాప్ పడితే తర్వాత సినిమాపై టెన్షన్ తప్పడం లేదు. ఆచార్య దెబ్బకి ఆయనతో సహా మెగా అభిమానులు అందరూ తీవ్ర నిరాశ చెందారు. దాని తర్వాత చేసిన గాడ్ ఫాదర్ ఎలా ఉంటుందో అని అందరూ ఆందోళన చెందారు. తొలిరోజున ప్రపంచవ్యాప్తంగా రూ.38 కోట్లు కలెక్షన్స్ రాబట్టగా నేడు రెండోరోజున రూ.31 కోట్లు రాబట్టి మొత్తం రూ.69 కోట్లు కలెక్షన్స్ సాధించడంతో చిరంజీవి, దర్శకుడు మోహన్ రాజాతో సహా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కనుక మరో రెండు రోజులలో రూ.100 కోట్లు సాధించడం ఖాయమే.
గాడ్ ఫాదర్ చిత్రంలో ప్రధానపాత్రలో నటించిన నయనతార సినిమాలో తప్ప బయట ఎక్కడా కనిపించకపోవడం విశేషం. ఆమె సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనబోనని ముందే షరతు పెట్టి అందుకు నిర్మాతలు అంగీకరిస్తేనే సినిమాకు సంతకం చేస్తుంటుంది. కనుక గాడ్ ఫాదర్ ప్రమోషన్స్‌లో ఆమె ఎక్కడా కనబడలేదు. నయనతార ఎంత గొప్ప నటి అయినప్పటికీ సినీ పరిశ్రమలో ఉంటూ ఇంత విచిత్రంగా వ్యవహరిస్తుండటం సరికాదనే చెప్పవచ్చు.
మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రామ్ చరణ్, ఆర్‌బీ.చౌదరి కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లపై నిర్మించారు. ఈ సినిమాలో సత్యదేవ్ చాలా అద్భుతంగా నటించి చిరంజీవి ప్రశంశలు అందుకొన్నాడు.