
ఫ్యాన్స్ చూపించే అభిమానం ఒక్కోసారి ఆ హీరోలకే తలనొప్పిగా మారుతుందని చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. తాజాగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ తమ అభిమాన నటుడి సినిమా గురించి మా టివి వారి మీద యుద్ధానికి దిగారు. రీసెంట్ గా జూనియర్ ఎన్.టి.ఆర్ నటించిన సినిమా జనతా గ్యారేజ్. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తారక్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. అయితే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీ మొత్తంతో కొన్న మాటివి ఈ నెల 23న టెలికాస్ట్ చేయనుంది.
కేవలం తన అభిమాన నటుడి సినిమా 50 రోజులు తర్వాత బుల్లితెర మీద రావడం అభిమానులకు నచ్చట్లేదు. సినిమా ఫ్లాప్ అయితే ఓకే కాని సూపర్ హిట్ సినిమాను ఇంత త్వరగా వేయడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే మా టివిని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో పెద్ద గొడవే చేస్తున్నారు. ఆర్.ఐ.పి మాటివి అంటూ ప్లకార్డ్స్ కూడా పట్టుకుని కొందరు తారక్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఈ హడావిడి చేస్తున్నారు.
అయితే మాటివి వారు మాత్రం ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దర్శక నిర్మాతల దగ్గర నుండి కొన్న సినిమాను వారికి ఇష్టమొచ్చిన టైంలో వేసుకునే హక్కు వారికుంది. అయినా జనతా గ్యారేజ్ మాటివిలో వస్తే ఆ సినిమాకు ఇంకా ప్లస్ అవుతుంది తప్ప క్రేజ్ ఏం తగ్గదు. ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో మా టివి మీద ఆగ్రహ జ్వాలలు వెళ్లగక్కుతున్నారు.