
ఓ దర్శకుడు 150 సినిమాలు డైరెక్ట్ చేశాడు అంటే అది కేవలం దాసరి నారాయణ రావు గారి వల్లే అయ్యింది. తన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన దాసరి గారు మెగా ఫోన్ పట్టుకుని చాలా రోజులయ్యింది. పరమవీరచక్ర ఫ్లాప్ తర్వాత మంచు విష్ణుతో చేసిన ఎర్రబస్సు కూడా నిరాశ పరచడంతో దర్శకత్వం ఆపేశారు దాసరి. అయితే తన నిర్మాణ సారధ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని దాదాపు రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కాని దానికి ముహుర్తం బయట పడట్లేదు.
ఇక పవన్ సినిమా అటుంచితే తాను మళ్లీ డైరెక్టర్ గా మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యారట దాసరి. తన ప్రొడక్షన్లోనే 'పితృదేవోభవ' అనే సినిమా తీస్తున్నారట. ఇప్పటికే ఆ సినిమాకు సంబందించిన కథ పూర్తి అయ్యిందట. ఇక సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి అంటున్నారు. ఇక ఇవే కాకుండా మరో రెండు సినిమాలు తను నిర్మాతగా వేరే దర్శకులతో తీస్తారని తెలుస్తుంది. సో మొత్తానికి వచ్చే సంవత్సరం దాసరి కాంపౌండ్ నుండి సినిమాలు వస్తాయన్నమాట.
ప్రస్తుతం కుర్ర దర్శకుల హవా కొనసాగిస్తున్న ఈ తరుణంలో తన మార్క్ సెంటిమెంట్ కథాంశంతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు దాసరి నారాయణ రావు. మరి ఆ సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.