కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన అన్నాతే (తెలుగులో పెద్దన్న) అట్టర్ ఫ్లాప్ అవడంతో ఆయన అభిమానులు చాలా నిరాశ చెందారు. దాని తర్వాత ఆయన ప్రముఖ తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తుండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే విజయ్ హీరోగా ఆయన దర్శకత్వం చేసిన బీస్ట్ మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది. రజనీ, నెల్సన్ ఇద్దరికీ ఫ్లాప్స్ పడటంతో ఈ సినిమా ఎలా వస్తుందో అని అభిమానులు ఆందోళన చెందడం సహజమే. అయితే ఈరోజు విడుదల చేసిన ఆ సినిమాలోని రజినీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి అభిమానులలో మళ్ళీ నమ్మకం, ఉత్సాహం వచ్చాయి. ఈ సినిమాకు జైలర్ అని పేరు ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రజినీకాంత్ చేతులు వెనక్కు కట్టుకొని ఆగ్రహంగా చూస్తున్నట్లు చూపారు.
ఈ సినిమాకు జైలర్ అని పేరు పెట్టినందున దీనిలో రజనీకాంత్ జైలర్‌గా నటిస్తున్నట్లు అర్దమవుతోంది. కనుక జైలులో ఖైదీలతో ముడిపడి ఉన్న కధాంశం అయ్యుండవచ్చని స్పష్టం అవుతోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. రజినీకాంత్, నెల్సన్ ఇద్దరికీ ఓ హిట్ అవసరం కనుక వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసి విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మిగిలిన నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.