తెలుగు సినీ కార్మికుల కోసం తన సొంత డబ్బుతో ఓ హాస్పిటల్ నిర్మిస్తానని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. హైదరాబాద్లో పార్క్ హయాత్ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ, “అందరిలాగే నేను కూడా సినీ పరిశ్రమలోకి వచ్చిన మొదట్లో చాలా సినిమాలు చేయాలని, తర్వాత డబ్బు, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని, తర్వాత భార్య పిల్లలకు సుఖవంతమైన జీవితం, బ్యాంక్ బ్యాలన్స్ వంటివి సమకోర్చుకోవాలని కోరుకొన్నాను. వాటి కోసం చాలా కష్టపడ్డాను.
ఓ స్థాయికి వచ్చిన తర్వాత నేను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైన నా అభిమానులకి, ఈ సమాజానికి ఏం చేయగలనని ఆలోచించి బ్లడ్ బ్యాంక్ స్థాపించాను. అందరి సహాయసహకారాలతో నేటికీ అది విజయవంతంగా నడుస్తోంది. నా ఎదుగుదలలో భాగమైన సినీ పరిశ్రమలో కార్మికులకు కూడా ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. కోవిడ్ సమయంలో చాలామంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ డబ్బులేక వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడటం నా కళ్ళారా చూశాను. అప్పుడు ఇండస్ట్రీలో అందరి సహకారంతో యధాశక్తిన తోడ్పడగలిగాము.
ఇప్పుడు సినీ కార్మికుల కోసమే ప్రత్యేకంగా చిత్రపురిలో నా సొంత డబ్బుతో నా తండ్రిగారు కొణిదెల వెంకట్రావు పేరుతో పది-బెడ్లతో కూడిన ఓ హాస్పిటల్ నిర్మించాలని నిర్ణయించుకొన్నాను. దీనిని వచ్చే ఏడాది ఇదే సమయానికి పూర్తిచేసి ప్రారంభిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. దీనిలో ఇంకా ఎవరైనా భాగస్వాములు కాదలిస్తే మరిన్ని అదనపు సౌకర్యాలు కల్పించవచ్చు కనుక అందరికీ ఇదే నా ఆహ్వానం,” అని అన్నారు.
సంగీత దర్శకుడు తమన్ వెంటనే స్పందిస్తూ, “త్వరలో నేను ఓ మ్యూజిక్ షో చేస్తాను. దానికి వచ్చే సొమ్మునంతా ఈ హాస్పిటల్కు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి ఇందుకు తమన్కు కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.