విజయ్ దేవరకొండని అందరూ రౌడీ హీరో అని ముద్దుగా పిలుచుకొంటారు. ఆయన మేనరిజం కూడా కాస్త అలాగే ఉంటుంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో అతను ఎదురుగా ఉన్న టీపాయ్ కాళ్ళు పెట్టి విలేఖరులతో మాట్లాడారు. దీనిపై సోషల్ మీడియాలో “విజయ్ దేవరకొండకి పాన్ ఇండియా హీరో అయ్యేసరికి పొగరు పెరిగిపోయింది. ప్రెస్‌మీట్‌లో తన ఎదురుగా జర్నలిస్టులు ఉన్నారని కూడా చూడకుండా టేబిల్‌పై కాళ్ళు పెట్టి మాట్లాడాడు,” అంటూ విమర్శలు మొదలైపోయాయి.
అవి చూసి ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఓ ఫిల్మ్ జర్నలిస్ట్ వెంటనే జరిగిన విషయం వివరించారు. నేను విజయ్ దేవరకొండని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు, “టాక్సీవాలా రోజులలో మనం చాలా చనువుగా మాట్లాడుకొన్నాము కానీ మీరిప్పుడు పాన్ ఇండియా హీరో అయిపోయారు. మీతో మాట్లాడాలంటే కాస్త బెరుకుగా ఉంది,” అని అన్నాను.
అప్పుడు విజయ్ దేవరకొండ స్పందిస్తూ, “అలాంటిదేమీ లేదు బ్రదర్. నేను ఎప్పటిలాగే ఉన్నాను. పాన్ ఇండియా... అవన్నీ అసలు పట్టించుకోవద్దు. రండి... ఎప్పటిలాగే హాయిగా కాలుమీద కాలేసుకొని కూర్చొని అడగండి... నేను కూడా కాలు మీద కాలేసుకొని కూర్చోంటా... ఇదిగో ఇలాగా...” అంటూ ఎదురుగా ఉన్న టేబిల్ మీద కాళ్ళు పెట్టి కూర్చొన్నాడు.
“విజయ్ దేవరకొండ మాటలు విని మేము కూడా చాలా నవ్వుకొన్నాం. ఆ తర్వాత చాలా హాయిగా ప్రెస్‌మీట్ సాగిపోయింది. అంతే. మాతో ఆయన అంత ఫ్రీగా, చనువుగా మాట్లాడితే దానిని సోషల్ మీడియాలో తప్పుగా భావించి విమర్శలు చేశారు,” అని ఆ జర్నలిస్ట్ చెప్పారు.
సోషల్ మీడియాలో తనపై విమర్శలు రావడంపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ, “ ప్రతీ ఒక్కరూ తమతమ రంగాలలో ఎదిగేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొంతమంది మనల్ని విమర్శించవచ్చు. వ్యతిరేకంగా ప్రచారం చేయవచ్చు. అప్పుడు మనం తిరిగి పోరాటం చేస్తూనే ముందుకు సాగిపోతుండాలి. నువ్వు నిజయతీగా ఉంటూ అందరికీ మంచి జరగాలని కోరుకొంటున్నప్పుడు ప్రజల ప్రేమ దేవుడి దయ ఎల్లప్పుడూ నిన్ను కాపాడుతూనే ఉంటాయి,” అని ట్వీట్ చేశారు.