అమెజాన్ ప్రైమ్‌లో పుష్ప విడుదల రేపే?

అల్లు అర్జున్‌, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ ప్రైమ్‌ దక్కించుకొన్నట్లు తెలుస్తోంది. దీని కోసం అమెజాన్ ప్రైమ్‌ పుష్ప నిర్మాతలకు రూ.22-27 కోట్లు వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం పుష్ప చిత్రం శుక్రవారం రాత్రి 8 గంటలకు అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. పుష్ప తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ వెర్షన్స్ మాత్రమే రేపు అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతాయని తెలుస్తోంది. అయితే అమెజాన్ ప్రైమ్‌ ఈవిషయం ఇంకా ప్రకటించవలసి ఉంది. అలాగే పుష్ప హిందీ వెర్షన్‌ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ గురించి ఇంకా తెలియవలసి ఉంది. 

డిసెంబర్‌ 17న థియేటర్లలో విడుదలైన పుష్ప నెలరోజులు తిరక్క మునుపే ఓటీటీలో విడుదలవుతుండటం నిజమే అయితే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమే. ఎందుకంటే మరో వారం రోజులలో సంక్రాంతి పండుగ ఉంది. పుష్పతో సహా ఏ సినిమాకైనా సంక్రాంతి పండుగ కలెక్షన్లు ఓ రేంజ్‌లో ఉంటాయని అందరికీ తెలుసు. అదీగాక ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ రెండు భారీ చిత్రాలు వాయిదా పడ్డాయి. కనుక పుష్ప సంక్రాంతి కలెక్షన్స్ కూడా కొల్లగొట్టవచ్చు. కానీ ఇప్పుడు పుష్పను ఓటీటీలో రిలీజ్ చేసినట్లయితే ఇంతవరకు ఆ సినిమాను చూడనివారు కూడా చూసేస్తారు కనుక థియేటర్లలో పుష్ప సంక్రాంతి కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంది. మరి పుష్ప అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్‌ చేయడం నిజమో కాదో...చేస్తున్నట్లయితే అమెజాన్ ప్రైమ్ ఇచ్చింది సంక్రాంతి కలెక్షన్ల కంటే ఎక్కువే అనుకోవలసి ఉంటుంది.