రాధేశ్యామ్ రిలీజ్ వాయిదా

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 14న రిలీజ్ కావలసి ఉంది. కానీ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు యూవీ క్రియెషన్స్ సంస్థ కొద్ది సేపటి క్రితం ట్విట్టర్‌లో వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్‌ విజృంభిస్తుండటంతో రాధేశ్యామ్ విడుదలను వాయిదా వేయక తప్పలేదని తెలిపింది. త్వరలోనే థియేటర్లలో కలుసుకొందామని యూవీ క్రియెషన్స్ ట్వీట్ చేసింది. 



జనవరి 7న విడుదల కావలసిన ఆర్ఆర్ఆర్‌ ఇప్పటికే వాయిదా పడింది. ఇప్పుడు రాధేశ్యామ్ కూడా వాయిదా పడటంతో ఈసారి సంక్రాంతి బరిలో నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు తప్ప పెద్ద సినిమాలు లేకపోవడంతో చిన్న సినిమాలు విడుదలకు మార్గం సుగమం అయ్యింది. అలాగే పుష్పకు పోటీ లేకపోవడం ఆ సినీ నిర్మాతలకు కలిసి వచ్చే అంశమే.  

గత అనుభవాలను బట్టి చూసినట్లయితే రాబోయే ఒకటి రెండు నెలల్లో దేశంలో కరోనా, ఒమిక్రాన్‌ కేసులు ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గవని చెప్పవచ్చు. కనుక రాబోయే కొన్ని రోజులలో దేశవ్యాప్తంగా థియేటర్లన్నీ మూతపడవచ్చు...కరోనా భయాలు, ఆంక్షలు పెరగవచ్చు. ఇవన్నీ పూర్తిగా తగ్గి మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనడానికి కనీసం మరో 3-4 నెలలు పట్టవచ్చు. అంటే మార్చి, ఏప్రిల్ వరకు వేచి చూడాల్సిందే. కానీ చాలా భారీ బడ్జెట్‌తో ఏళ్ళ తరబడి పాన్ ఇండియా మూవీలుగా తీసిన ఆర్ఆర్ఆర్‌, రాధేశ్యామ్ చిత్రాలు అప్పటి వరకు రిలీజ్‌ చేయలేకపోతే వాటి నిర్మాతలకు చాలా నష్టం కలగవచ్చు. కనుక ఇప్పుడే వాటిని రిలీజ్ చేసుకోవడం మంచిదేమో?