
తెలుగు సినీ పరిశ్రమ పరిస్థితి ఒక సంక్షోభం నుంచి మరో సంక్షోభానికి సాగుతున్నట్లుంది. మొదట కరోనా తరువాత లాక్‌డౌన్ దెబ్బలకి చాలా నష్టపోయింది. మళ్ళీ కోలుకొని నిలద్రొక్కుకొనేలోగా ఒమిక్రాన్ దెబ్బేస్తోందిప్పుడు. సుమారు రూ.400 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా పడటమే ఇందుకు తాజా నిదర్శనం.
ఇవి సరిపోవన్నట్లు ఏపీ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తుండటంతో, కీలకమైన క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండుగ సమయంలో ఏపీలో పలు థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో మరో వివాదం క్రమంగా రాజుకొంటోంది. అదే సినీ పరిశ్రమలో ఎవరు పెద్ద దిక్కు?
దాసరి నారాయణ రావు చనిపోయినప్పటి నుంచి సినీ పరిశ్రమ చిరంజీవిని పెద్దదిక్కుగా భావిస్తుంటే, ఇటీవల ఆయన మాట్లాడుతూ “నాకు అలాంటి హోదా వద్దు. పరిశ్రమలో ఎవరో ఇద్దరు కీచులాడుకొని పంచాయితీ పెడితే నేను తీర్పు చెప్పను కానీ సినీ పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తప్పకుండా ఆదుకోవడానికి నేను సిద్దం,” అని అన్నారు.
ఆ తరువాత మోహన్ బాబు స్పందిస్తూ, “సినీ పరిశ్రమ అంటే ఎవరో నలుగురు హీరోలు, నలుగురు దర్శకులు, నలుగురు నిర్మాతలు కాదు. చిన్నా పెద్దా అందరూ కలిస్తేనే సినీ పరిశ్రమ. కానీ ఇటీవల నలుగురు పెద్దమనుషులు వెళ్ళి ఏపీ ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొన్నారు. సినిమా టికెట్ ధర ఎక్కువ పెడితే చిన్న సినిమాలు నష్టపోతాయి. తక్కువ పెడితే పెద్ద సినిమాలు నష్టపోతాయి. కనుక ప్రభుత్వాధినేతలను కలిసే ముందు సినీ పరిశ్రమలో అందరినీ సంప్రదించి, అందరి సమస్యలూ తెలుసుకొని వెళ్ళి ఉంటే బాగుండేది,” అంటూ బహిరంగ లేఖ వ్రాశారు.
తాజాగా ప్రముఖ నటుడు సుమన్ నిన్న తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, “నేను గత 44 ఏళ్ళుగా 10 భాషల్లో సుమారు 600కి పైగా సినిమాలు చేశాను. ఎవరి సహాయసహకారాలు లేకుండానే స్వయంకృషితో ఎదిగాను. సినీ పరిశ్రమలో కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ వంటి సీనియర్స్ ఉండగా ఎవరో ఒకరికి పెద్దరికం కట్టబెట్టడం సరికాదని భావిస్తున్నాను. తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వారిని సంప్రదిస్తే బాగుంటుంది,” అని అన్నారు.