ఎన్టీఆర్‌ హీరోయిన్‌గా సమంత ఖరారు?

రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్‌ను ఇటీవల పూర్తిచేసిన జూ.ఎన్టీఆర్‌ ప్రస్తుతం దాని ప్రమోషన్ కార్యక్రమాలతో చాలా బిజీబిజీగా తిరుగుతున్నాడు. అవి పూర్తికాగానే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్‌ అయినందున మళ్ళీ వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నట్లు ప్రకటించినప్పుడే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో కొత్త విషయం బయటకు వచ్చింది. దీనిలో జూ.ఎన్టీఆర్‌కు జోడీగా సమంతను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఇంకా అధికారికంగా ప్రకటించవలసి ఉంది. కొరటాల-జూ.ఎన్టీఆర్‌-సమంత కలిస్తే ఎలా ఉంటుందో జనతా గ్యారేజ్ చూపించింది. కనుక ఈ సినిమాలో మళ్ళీ వీరు ముగ్గురు కలిస్తే సినిమా తప్పకుండా సూపర్ హిట్‌ అవడం ఖాయం. రాజకీయ కధాంశంతో తీస్తున్న ఈ సినిమాతో కొరటాల, ఎన్టీఆర్‌ కలిసి ఏం చెప్పబోతున్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. జనవరి 15లోగా ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్ తదితరుల వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.