
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌కు చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు రెండో మేజిస్ట్రేట్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయన ప్రకాశం జిల్లాలోని ముప్పాళ్ళ గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద నుంచి అప్పు తీసుకొన్నారు. ఆ అప్పు తీర్చాలని ఒత్తిడి చేస్తుండటంతో బండ్ల గణేష్ ఆయనకు కొంతకాలం క్రితం రూ.1.25 కోట్లకు చెక్కు ఇచ్చారు. కానీ బండ్ల గణేష్ బ్యాంక్ ఖాతాలో అంతా డబ్బు లేకపోవడంతో చెక్ బౌన్స్ అయ్యింది. అప్పటి నుంచి వెంకటేశ్వర్లు పలుమార్లు బండ్ల గణేష్‌ను డబ్బు చెల్లించాలని కోరుతున్నారు. కానీ ఆయన స్పందించకపోవడంతో జిల్లా కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో విచారణకు కోర్టుకు హాజరుకావాలని ఎన్నిసార్లు నోటీసులు పంపించినా బండ్ల గణేష్ స్పందించకపోవడంతో కోర్టు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
గతంలో కూడా బండ్ల గణేష్ కడపకు చెందిన మహేశ్ అనే వ్యక్తి వద్ద నుంచి రూ.13 కోట్లు తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో కడప మేజిస్ట్రేట్ కోర్టు ఆయనపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసి కోర్టుకు రప్పించింది. ఆ కేసు నుంచి బయటపడిన తరువాత బండ్ల గణేష్ మళ్ళీ తప్పు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.