ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే నెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈ సినిమాలో అలనాటి రెబెల్ స్టార్ కృష్ణంరాజు నటిస్తున్నట్లు తెలిపారు కానీ ఆయన పరమహంసగా చేస్తున్న విషయం ఇంతవరకు బయటకు పొక్కనీయలేదు. ఈరోజు యూవీ క్రియేషన్ బ్యానర్స్ ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేసింది. దానిలో కాషాయదుస్తులు ధరించి, చేతిలో రుద్రాక్షమాలతో, నుదుట విభూది రేఖలతో కృష్ణంరాజు చాలా అద్భుతంగా ఉన్నారు. మళ్ళీ చాలా రోజుల తరువాత ఆయనను ఈవిదంగా చూసిన ఆయన అభిమానులు చాలా సంతోషిస్తున్నారు.
రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ వింటేజ్ లవ్ స్టోరీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. యాక్షన్ అండ్ రొమాంటిక్ హీరోగా పేరొందిన ప్రభాస్ ఈ సినిమాలో హస్త సాముద్రిక నిపుణుడుగా, కృష్ణంరాజు పరమహంసగా చేస్తుండటం, ఇటలీ బ్యాక్ డ్రాప్‌లో కధ సాగడంతో ఈ సినిమా అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. అందుకే ప్రభాస్ అభిమానులు రాధేశ్యామ్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.
రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియెషన్స్ రెండూ కలిసి పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నాయి. ఈ సినిమాను తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో సిద్దం అవుతోంది. దక్షిణాది భాషల వెర్షన్స్‌కు జస్టిన్ ప్రభాకరన్, హిందీలో అనూమాలిక్, మిథున్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
ఈనెల 23న హైదరాబాద్ రామోజీ ఫిలిమ్ సిటీలో సాయంత్రం 6 గంటలకు రాధేశ్యామ్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆదేరోజున సినిమా ట్రైలర్ కూడా విడుదల చేయబోతున్నారు.