
ప్రభాస్ హీరోగా చేసిన మిర్చి, పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన అత్తారింటికి దారేది సినిమాలలో ఐటెమ్ సాంగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన నటి హంసనందినికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఈవిషయం ఆమె స్వయంగా ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ, “ప్రస్తుతం నేను ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్ పోరాడుతున్నాను. జీవితంలో ఎన్ని సవాళ్ళు ఎదురవుతున్నప్పటికీ వాటి బాధితురాలిగా ఉండిపోవడానికి నేను సిద్దంగా లేను. కనుక పోరాడుతూనే ఉంటాను. నాలుగు నెలల క్రితం నా రొమ్ములో చిన్న కణితిని గుర్తించాను. అప్పుడే ఇక నేను సాధారణ జీవితం గడపలేనని గ్రహించాను. 18 ఏళ్ళ క్రితం నేను నా తల్లిని కోల్పోయాను. ఆమె బ్రెస్ట్ క్యాన్సర్‌తో మరణించింది. అప్పటి నుంచే నేను క్యాన్సర్ మహమ్మారి చీకటి నీడలో జీవిస్తున్నాను. చివరికి నేను భయపడుతున్నట్లే నాకూ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. బ్రెస్ట్‌లో కణితిని గుర్తించిన వెంటనే వైద్య పరీక్షలు చేయించుకొన్నాను. అప్పటికే గ్రేడ్-3 దశలో ఉన్నట్లు గుర్తించిన వైద్యులు దానిని శస్త్ర చికిత్సతో తొలగించారు. అది ఇక వ్యాపించదని వైద్యులు చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. కానీ నా సంతోషం ఎంతో కాలం నిలువలేదు.
మళ్ళీ వైద్య పరీక్షలు చేయించుకోగా బిఆర్‌సీఏ-1 (వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్) అని చెప్పారు. అంటే మళ్ళీ నాకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకే అవకాశం 70 శాతం, గర్భాశయం క్యాన్సర్ సోకే అవకాశం 45 శాతం ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. కనుక ఇక నా జీవితంలో కిమో థెరపీలు, శస్త్ర చికిత్సలు అనివార్యం అయ్యాయి. ఇప్పటివరకు తొమ్మిదిసార్లు కిమో థెరపీ చేయించుకొన్నాను మరో ఏడుసార్లు చేయించుకోవలసి ఉంటుంది.
ఈ సందర్భంగా నాకు నేను కొన్ని వాగ్ధానాలు చేసుకొన్నాను. ఈ మహమ్మారి నన్ను ఓడించడానికి, నా జీవితాన్ని నిర్దేశించడానికి అనుమతించబోను. దీనిని నవ్వుతూ ఎదుర్కొని విజయం సాధిస్తాను. ఇంకా చక్కగా, బలంగా మారి మళ్ళీ తిరిగివచ్చి సినిమాలలో నటిస్తాను. నా ఈ కధను అందరికీ తెలియజెప్పుతూ చైతన్యపరుస్తాను. ప్రేరణ కలిగిస్తాను. నా జీవితం నాకు ఏమి ఇచ్చిందో దానిని పండుగలా అనుభవిస్తాను.
నా ఈ కష్ట సమయంలో నా పట్ల ఎంతో అభిమానం చూపుతూ నా యోగక్షేమాలను తెలుసుకొంటున్న ప్రతీ ఒక్కరికీ, నాకు అండగా నిలబడిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఉన్న నేను త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను,” అని మెసేజ్ పెట్టింది హంసానందిని.