
అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా చేసిన పుష్ప రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఒకేసారి విడుదలవుతున్నందున అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే కన్నడ ప్రేక్షకులు పుష్ప నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే పుష్పలో వారికి ఏదో ఇబ్బంది కలిగించే అంశమో, పాటో ఉందని కాదు. తెలుగుతో పోలిస్తే కర్నాటకలో కన్నడ వెర్షన్‌కు తక్కువ థియేటర్లు కేటాయించడమే వారి ఆగ్రహానికి కారణం. కర్నాటకలో కన్నడ వెర్షన్‌కు ఎక్కువ థియేటర్లు కేటాయించాలి గానీ తెలుగు వెర్షన్‌కు కేటాయించడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనుక కర్నాటకలో పుష్ప రిలీజ్ చేయాలంటే కన్నడ వెర్షన్‌లోనే ముందు రిలీజ్ చేయాలని లేకుంటే సినిమాను బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు...#బాయ్‌కాట్పుష్పఇన్‌కర్ణాటక అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వారి బాదంతా పుష్పను తమ మాతృభాష కన్నడలో చూసి ఆనందించవలసిన సమయంలో తమకు అర్ధంకాని తెలుగులో చూడాల్సివస్తున్నందుకే అని అర్ధమవుతోంది. కనుక పుష్ప మేకర్స్ వారి బాధను అర్ధం చేసుకొని కర్ణాటకలో కన్నడ వెర్షన్ ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తారని ఆశిద్దాం.