మళ్ళీ అలా ఎప్పుడు జరగనీయను: అల్లు అర్జున్

పుష్పతో ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్‌ తన అభిమానులను ఉద్దేశ్యించి ఓ ట్వీట్ చేశారు. 

“ఈరోజు నా అభిమానులు కొందరు గాయపడ్డారని ఇప్పుడే నాకు తెలిసింది. ఈ ఘటనపై నా టీం పరిస్థితిని సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు నాకు సమాచారం అందజేస్తోంది. ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నేను అన్ని జాగ్రత్తలు తీసుకొంటాను. నాపట్ల మీకు గల ప్రేమాభిమానాలు నాకు చాలా విలువైనవి. కనుక నేనెప్పుడూ వాటిని అలుసుగా తీసుకోను,” అని ట్వీట్ చేశారు.         


సోమవారం హైదరాబాద్‌లో గీతా ఆర్ట్స్ స్టూడియోలో అల్లు అర్జున్‌ సినిమా షూటింగ్ జరుగుతోందని తెలుసుకొన్న అభిమానులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. విషయం తెలుసుకొన్న పోలీసులు అక్కడకు చేరుకొని వారికి నచ్చజెప్పి వెనక్కు తిప్పి పంపించేందుకు చాలా ప్రయత్నించారు. కానీ ఎలాగైనా తమ అభిమాన హీరోను చూడాలని ఆరాటపడుతున్న అభిమానులు అక్కడి నుంచి కదలడానికి ఇష్టపడలేదు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు స్వల్పంగా లాఠీ ఛార్జ్ చేయడంతో కొందరు గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకొన్న అల్లు అర్జున్‌ వెంటనే ట్విట్టర్‌లో స్పందించారు.