
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం పట్టణంలో ఎస్సైగా పనిచేస్తున్న రాజా రవిచంద్ర జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమంలో పాల్గొని కోటి రూపాయలు గెలుచుకున్నారు. జూ.ఎన్టీఆర్ హోస్ట్‌గా ఉన్న ఈ కార్యక్రమం గత రెండు నెలలుగా సాగుతోంది కానీ ఇంతవరకు ఎవరూ కోటి రూపాయలు గెలుచుకోలేదు. ఈ కార్యక్రమంలో తొలిసారిగా కోటి రూపాయలు గెలుచుకొన్న వ్యక్తిగా రాజా రవిచంద్ర నిలిచారు.
పోలీస్ శాఖ తరపున రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలలో పాల్గొనడం, రాజకీయ, సామాజిక, పౌరాణిక, ఆధ్యాత్మిక తదితర అంశాలపై మంచి పట్టు కలిగి ఉండటంతో ఈ కార్యక్రమంలో చాలా ప్రశ్నలకు ఆయన ఏమాత్రం తడుముకోకుండా సమాధానాలు చెపుతూ కోటి రూపాయల 15వ ప్రశ్నకు చేరుకున్నారు. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే...
1956 రాష్ట్రాల పునర్విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ అవతరణకు కారణమైన కమిషన్‌కు, ఎవరు అధ్యక్షత వహించారు?
A. రంగనాథ్ మిశ్రా
B. రంజిత్‌సింగ్ సర్కారియా
C. బీపీ మండల్
D. ఫజల్ అలీ కమిషన్.
దీనికి కొద్దిసేపు ఆలోచించిన తరువాత ‘ఆప్షన్ డి’ అని సమాధానం చెప్పడం అది సరైన జవాబు కావడంతో రాజా రవిచంద్ర కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఈ షోలో మొదటి నుంచి చివరి వరకు చాలా తక్కువ హెల్ప్ లైన్స్ ఉపయోగించుకొంటూ, చకచకా సరైన సమాధానాలు చెపుతూ కోటి రూపాయలు గెలుచుకొన్నందుకు జూ.ఎన్టీఆర్ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. కొస మెరుపు ఏమిటంటే, ఈ షోలో గెలుచుకొన్న ఈ డబ్బుతో ఒలింపిక్ పోటీలలో పాల్గొనేందుకు వినియోగిస్తానని, ఒలింపిక్ పోటీలలో భారత్‌కు పతకం సాధించడమే తన జీవిత లక్ష్యమని రాజా రవీంద్ర చెప్పారు.