
ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ప్రముఖ కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో అత్యున్నత పురస్కారమైన ‘కర్ణాటక రత్న’ అవార్డును ప్రకటించింది. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మై స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కన్నడ సినీ పరిశ్రమకి, రాష్ట్ర ప్రజలకి ఆయన అందించిన సేవలకుగాను కర్నాటక రత్న అవార్డుతో గౌరవించాలని నిర్ణయించినట్లు సిఎం బస్వరాజు బొమ్మై తెలిపారు. ప్రభుత్వం ఆయనకు మరణాంతరం ఈ అవార్డును ప్రకటించడంపై కన్నడ ప్రజలు, ముఖ్యంగా పునీత్ రాజ్‌కుమార్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పునీత్ రాజ్‌కుమార్ సినీ పరిశ్రమలో ఎంత మంచి పేరుందో, ఆయన చేసే పలు సమాజ సేవా కార్యక్రమాల కారణంగా బయట ప్రజలలో కూడా మంచి పేరు, గౌరవం ఉన్నాయి. పునీత్ రాజ్‌కుమార్ చనిపోయేనాటికి 1,800 మంది అనాధపిల్లలను దత్తత తీసుకొని వారి బాగోగులు చూస్తున్నారు. వారందరి బాధ్యతను కోలీవుడ్ నటుడు విశాల్ స్వీకరించారు.