
బాబు బంగారంతో విక్టరీ వెంకటేష్ ను ఫ్యాన్స్ ఏవిధంగా కోరుకుంటున్నారో అలా చూపించాడు మారుతి. ఇక ఆ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చిన వెంకటేష్ ఇప్పుడిక గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సాలా ఖదూస్ రీమేక్ గా చేస్తున్న గురు సినిమాతో బిజీగా ఉన్న వెంకటేష్ ఆ తర్వాత ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా చేయనున్నాడు. నేను శైలజ డైరక్టర్ కిశోర్ తిరుమల ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు.
అయితే ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న అవసరాల శ్రీనివాస్ వెంకటేష్ కు సరిపోయే ఓ కథ సిద్ధం చేయబోతున్నాడట. రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఖుషిగా ఉన్న అవసరాల శ్రీనివాస్ థర్డ్ మూవీ నానితో చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. కాని నాని ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాల్సిన అవసరం ఉండగా శ్రీనిని కొంత టైం అడిగాడట.
అందుకే ఈలోపు స్టార్ హీరోతో సినిమా తీసి స్టార్ డైరక్టర్ గా అవతరించే ఆలోచనలో ఉన్నాడు అవసరాల శ్రీనివాస్. ఇప్పటికే వెంకీ ఇమేజ్ కు సరిపోయే ఎంటర్టైనింగ్ కథను సిద్ధం చేశాడట. అయితే ఇందులో కూడా తన మార్క్ ఎమోషనల్ టచ్ ఉండేలా జాగ్రత్త పడ్డాడట. మరి వెంకటేష్ కథ విని ఓకే అంటే కనుక అవసరాల కూడా స్టార్ డైరక్టర్స్ రేసులో చేరినట్టే.