
ఆదివారం జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు వర్సెస్ ప్రకాష్ రాజ్ ఆసక్తికరమైన పోటీ అనంతరం మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచిన విషయం తెలిసిందే. అయితే మా గొడవలు ఇప్పుడప్పుడే చల్లారేలా లేవు అన్నట్టుగా పరిస్థితులు కనబడుతున్నాయి. మా ప్రెసిడెంట్ గా మంచు విష్ణు గెలవగానే మెగా బ్రదర్ నాగ బాబు మా సభ్యత్వానికి రాజీనామా చేశారు.
లేటెస్ట్ గా ప్రకాష్ రాజ్ కూడా 'మా' ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 'మా' ఎన్నికల్లో ఈసారి ఎక్కువమంది ఓటు హక్కు వినియోగించుకున్నారని.. మంచు విష్ణు ఇచ్చిన హామీలన్ని నెరవేర్చాలని అన్నారు ప్రకాష్ రాజ్. ఇక ఈ రాజీనామా నిర్ణయం బాధతో తీసుకున్నది కాదు.. తెలుగువాడిగా పుట్టకపోవడం తన తప్పుకాదని.. అతిథిగా వచ్చాను.. అతిథిగా ఉంటానని ప్రకటించారు ప్రకాష్ రాజ్. ప్రాంతీయత ఆధారంగా ఎన్నికలు జరిగాయని మంచు విష్ణు గెలుపుని స్వాగతిస్తున్నానని అన్నారు ప్రకాష్ రాజ్.
ప్రాంతీయ వాదం, జాతీయవాదంతో ఈ ఎన్నికలు జరిగాయి. తెలుగు వ్యక్తి కాని వాడు ఓటు వేయవచ్చు కాని ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని ప్రచారం మొదలు పెట్టారు. మీరు వచ్చిన తర్వాత నిబంధనలు మారుస్తానని చెప్పారు. నా తల్లిదండ్రులు తెలుగువారు కాకపోవడం నా తప్పు.. వాళ్ల తప్పుకాదని అన్నారు. మెంబర్స్ ఆమోదించారు తెలుగుబిడ్డ మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు. దాన్ని తాను స్వాగతిస్తున్నా అని అన్నారు ప్రకాష్ రాజ్. ఒక కళాకారుడిగా తనకంటూ ఒక ఆత్మగౌరవం ఉంటుంది. అందుకే 'మా' ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా అని అన్నారు. ప్రేక్షకులకు నాకు ఉన్న బంధం సినిమాలతో కొనసాగుతుందని అన్నారు. పెద్ద నటులు మోహన్ బాబు గారు. కోట గారు.. చలపతి రావు తనయుడు రవి వీళ్లంతా అతిథిగా వస్తే అతిథిగా ఉండాలని అనారు. అలానే ఉంటానని అన్నారు ప్రకాష్ రాజ్. 'మా' ఎన్నికల్లో జాతీయవాదం వచ్చింద్ది. బీజేపీ నేత బండి సంజయ్ లాంటి వాళ్లు ట్వీట్ చేశారని అన్నారు ప్రకాష్ రాజ్. మాతో తనది 21 ఏళ్ల అనుబంధం అని అన్నారు.