ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌ మృతి..!

సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ మంగళవారం తెలవారుజామున నాలుగు గంటలకు చెన్నైలో తుది శ్వాస విడిచారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన ఈశ్వర్ పూర్తి పేరు కొసన్నా ఈశ్వర రావు. పబ్లిసిటీ డిజైనర్ గా కెరియర్ ప్రారంభించిన ఆయన 2600కు పైగా సినిమాలకు పబ్లిసిటీ డిజైన్స్ అందించారు. బాపు డైరెక్ట్ చేసిన సాక్షి (1967) సినిమాతో పబ్లిసిటీ డిజైనర్ గా ఈశ్వర్ ప్రయాణం మొదలైంది. అప్పటి నుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. 40 ఏళ్ల పాటు నిర్విరామంగా ఆయన పనిచేసారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో ఆయన పనిచేశారు. 

విజయా, ఏ.వి.ఎం, జెమిని, అన్నపూర్ణ, గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్, వైజయంతి తదితర అగ్ర నిర్మాణ సంస్థలకు పబ్లిసిటీ డిజైనర్ గా ఆయన పనిచేశారు. దేవుళ్లు సినిమాకు ఈశ్వర్ చివరగా పబ్లిసిటీ డిజైన్ చేశారు. ఈశ్వర్ రాసిన సినిమా పోస్టర్ పుస్తకానికి సినిమా గ్రంధ రచన విభాగంలో  2011 లో నంది అవార్డ్ వచ్చింది. 2015లో ఆయన సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గాను రఘుపతి వెంకయ్య పురస్కారం తో సత్కరించారు.