టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. డైరక్టర్ పూరీ 9 గంటల విచారణ..!

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో భాగంగా డైరక్టర్ పూరీ జగన్నాథ్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు విచారణ జరిపారు. పూరీకి చెందిన మూడు బ్యాంక్ ఖాతాల లావాదేవీల గురించి పూర్తిగా ఆరా తీసినట్టు తెలుస్తుంది. ఉదయం 10:17 గంటల నుండి మొదలైన ఈ విచారణ రాత్రి 7:45 గంటల వరకు కొనసాగింది. దాదాపు 9 గంటల వరకు ఈ విచారణ జరిగిందని తెలుస్తుంది. పూరీ జగన్నాథ్ పై విచారణ జరుపుతుండగా అక్కడకు టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఈడీ కార్యాలయానికి వచ్చారు. తాను పూరీ కోసం వచ్చానని.. తనకు ఎవరూ నోటీసులు ఇవ్వలేదని ఆయన అన్నారు. 

టాలీవుడ్ డ్రగ్స్ కేసుకి సంబందించి 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇదివరకు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ 62 మందిని విచారించగా.. డ్రగ్స్ కేసులో లబ్ధిదారుల అక్రమాస్తుల జప్తు దిశగా ఈడీ కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. పూరీ జగన్నాథ్, రవితేజ, నవదీప్, తరుణ్, ఛార్మి, రానా, రకుల్, నందు, ముమైత్ ఖాన్, తనీష్ లతో పాటుగా ఎఫ్ క్లబ్ ఓనర్ రవితేజ డ్రైవర్ తో సహా మొత్తం 12 మంది ఈ నెల 31 నుండి సెప్టెంబర్ 22 వరకు వరుసగా విచారిస్తారని తెలుస్తుంది. వీరి విచారణ పూర్తైన అనంతరం మరికొంతమందికి నోటీసులు జారీ చేస్తారని తెలుస్తుంది.