దసరా బరిలో గెలిచేదెవరు..?

తెలుగు సినిమా పరిశ్రమలో ఫెస్టివల్ టార్గెట్ గా వరదల్లా సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. ఇక పెద్ద పండుగలైన సంక్రాంతి, దసరా బరిలో అయితే పెద్ద సినిమాల సందడి మాములుగా ఉండదు.. అయితే ఈసారి రాబోతున్న దసరా బరిలో కేవలం చిన్న సినిమాల తాకిడే తగలనుంది. బరిలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ ధృవ  సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో ఇక చిన్న సినిమాలన్ని క్యూ కట్టి రిలీజ్ చేస్తున్నారు. దసరాలో రిలీజ్ అవబోతున్న సినిమాల లిస్ట్ ఒకసారి చూస్తే..

'ప్రేమం' రీమేక్ తో నాగచైతన్య: మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమం రీమేక్ తో రాబోతున్న చైతు పండుగ రోజు ప్రేక్షకులందరికి ప్రేమ పరవశం కలిగించేందుకు సిద్ధమయ్యాడు. చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే పోస్టర్స్ తో క్రేజ్ సంపాదించిన ప్రేమం ఫేవరేట్ మూవీ అని చెప్పొచ్చు.

అందాల 'అభినేత్రి': తమన్నా ప్రధాన పాత్రలో ప్రభుదేవ హీరోగా నటిస్తున్న సినిమా అభినేత్రి.. హర్రర్ నేపథ్యంతో రాబోతున్న ఈ సినిమాపై తమన్నా ఎంతో నమ్మకంగా ఉంది. తమన్నా మొదటిసారి లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించగా తెలుగు తమిళ హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగులో కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి.

'ఈడు గోల్డ్ ఎహే'తో సునీల్ ప్రయత్నం: వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సునీల్ జక్కన్న కాస్త ఊరటనిచ్చేలా కనిపించినా ఓవరాల్ గా చూస్తే అది నిరాశ పరచిందని అంటున్నారు. ఇక ప్రస్తుతం సునీల్ వీరు పోట్ల కాంబినేషన్లో ఈడు గోల్డ్ ఎహే సినిమాతో రాబోతున్నాడు. దసరా బరిలో దిగి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న సునీల్ ఈసారైనా హిట్ దక్కించుకుంటాడో లేదో చూడాలి.

ప్రకాశ్ రాజ్ చెప్పబోతున్న 'మన ఊరి రామాయణం': నటుడిగా క్రేజ్ సంపాదించిన ప్రకాశ్ రాజ్ దర్శక నిర్మాతగా కూడా తన మార్క్ సినిమాలతో వస్తుంటాడు. ప్రత్యేకమైన కథ కథనాలతో ప్రకాశ్ రాజ్ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమా మన ఊరి రామాయణం. సినిమా మొత్తం నేచురల్ అప్పీల్ తో ఉంటూ దసరా సీజన్లో రిలీజ్ అవుతుంది. అభిరుచి గల ప్రేక్షకులందరు చూడాలనుకునే సినిమాగా ఇది ఖచ్చితంగా మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది.

'జాగ్వార్' గా రాబోతున్న నిఖిల్: కర్ణాటక మాజీ సిఎం కుమార స్వామి తనయుడు హీరోగా తెరంగేట్రం చేస్తూ అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా జాగ్వార్. ఈ సినిమా ప్రభావం అంతగా ఉండకపోయినా భారీ బడ్జెట్ తో ఐ ఫీస్ట్ విజువల్ థండర్ గా తెలుగు ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసేందుకు జాగ్వార్ వస్తున్నాడు.

సో రిలీజ్ అయ్యే ఈ సినిమాలన్నిటిలో ఏది ఆడియెన్స్ మెప్పు పొందుతుందో చూడాలి. ఇక ఇవే కాకుండా సెప్టెంబర్ 29, 30 రోజుల్లో కళ్యాణ్ రాం పూరి ఇజం, రాం హైపర్ మూవీలు కూడా రిలీజ్ అవబోతున్నాయి.