దసరా గిఫ్ట్ ఇవ్వబోతున్న బాలయ్య..!

నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న వందవ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని కోటల్లో షూటింగ్ జరుపుకుంటుంది. సినిమాలో కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్న క్రిష్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా షురూ చేస్తున్నాడు. ఇప్పటికే సినిమాలో వార్ సీక్వెన్సెస్ తో పాటుగా క్లైమాక్స్ ఎపిసోడ్స్ కూడా ముగిశాయట. ఇక వాటికి సంబంధించిన గ్రాఫిక్ వర్క్ ఓ పక్క జరుగుతూనే ఉంది. ఇక రానున్న దసరా కానుకగా నందమూరి అభిమానులకు తన సినిమా టీజర్ వదులుతున్నాడు బాలయ్య బాబు.

చాలా ప్రత్యేకంగా ఉండబోతున్న ఈ సినిమా పట్ల చిత్రయూనిట్ అంతా ఎంతో నమ్మకంగా ఉన్నారు. సినిమా మొదలైనప్పుడే తెలుగు జాతి గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుందని చెప్పిన బాలకృష్ణ ఆ విధంగానే సినిమా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే జార్జియా, మోరాఖో లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్న శాతకర్ణి సినిమా ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని రాజదర్బార్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే రాజసూయ యాగం పూర్తి చేసుకున్న ఈ సినిమా మరికొద్దిరోజులు అక్కడే షూటింగ్ చేయనుంది.

ఇక మూవీలో బాలయ్య తల్లి పాత్రలో హేమమాలిని చేస్తుండగా.. రాణిగా శ్రీయా శరణ్ నటిస్తుంది. రీసెంట్ గా వశిష్ట దేవిగా శ్రీయ లుక్ రివీల్ చేసిన డైరక్టర్ క్రిష్ ఆ లుక్ తో సినిమా మీద అంచనాలను మరింత పెంచేశాడు. మరి పోస్టర్స్ తోనే క్రేజ్ తెచ్చేస్తున్న ఈ సినిమా టీజర్ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. దసరాకు రిలీజ్ అవుతున్న ఈ సినిమా టీజర్ పై కేవలం నందమూరి అభిమానులే కాదు సినీ ప్రియులు కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.