
టాలీవుడ్ సీనియర్ నిర్మాత దొరస్వామి రాజు గుండెపోటుతో సోమవారం మృతిచెందారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన రెండు వారాల క్రితం హాస్పిటల్ లో చేరారు. ట్రీట్ మెంట్ అందుతున్నా సరే పరిస్థితి విషమించడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు.
తెలుగు సినిమా చరిత్రలో వి.దొరస్వామి రాజుకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. డిస్ట్రిబ్యూటర్ గా సూపర్ సక్సెస్ అయిన దొరస్వామి రాజు నిర్మాతగా కూడా గొప్ప సినిమాలను నిర్మించారు. 1978లో V.M.C ప్రొడక్షన్స్ ను స్థాపించిన దొరస్వామి అక్కినేని నాగార్జునతో కిరాయి దాదా సినిమా చేశారు. VMC బ్యానర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. సీతారామయ్య గారి మనవరాలు, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, అన్నమయ్య, సింహాద్రి లాంటి హిట్ సినిమాలను నిర్మించారు దొరస్వామి రాజు.
సీడెడ్ ప్రాంతానికి చెందిన డిస్ట్రిబ్యూటర్ గా ఎన్నో వందల సినిమాలను పంపిణీ చేశారు దొరస్వామి రాజు. దాదాపు దొరస్వామి రాజు 750 సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. దొరస్వామి రాజు రాజకీయాల్లో కూడా అనుభవం ఉంది. 1994లో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు దొరస్వామి రాజు. టిటిడి బోర్డ్ మెంబర్.. ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్.. డిస్టిబ్యూటర్ కౌన్సిల్ ప్రెసిడెంట్.. ఇలా ఎన్నో కీలక పదవుల్లో ఆయన ఉన్నారు. దొరస్వామి రాజు మృతి పట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు దిగ్బ్రాంతికి గురయ్యారు.