బడ్జెట్ కారణంగా ఓ గొప్ప సినిమా మిస్ అయ్యాం..!

ఇప్పుడు స్టార్ హీరో సినిమా అంటే మినిమం 50 కోట్ల పైమాటే.. ఇదేదో కలక్షన్స్ అనుకునేరు కాదండి బాబు సినిమాకు అయ్యే ఖర్చే టాప్ లేచిపోతుంది. అయితే స్టార్ సినిమా కరెక్ట్ గా ఆడాలే కాని ఆ బడ్జెట్ కు రెండింతలు రాబట్టేయొచ్చు. అయితే ఓ క్రేజీ కాంబినేషన్లో ఓ సినిమా కేవలం బడ్జెట్ కారణాల వల్లే ఆగిపోయిందట. అది ఏ సినిమానో తెలిస్తే అందరు షాక్ అవుతారు.. సౌత్ సినీ దర్శకుల్లో తనకంటూ ఓ మార్క్ ఏర్పాటు చేసుకున్నారు డైరక్టర్ మణిరత్నం. అయితే అలాంటి స్టార్ డైరక్టర్ తో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కోలీవుడ్ ఇళయదళపతి విజయ్ కలిసి సినిమా చేస్తే.. అది అంచనాలకే అందట్లేదు కదా.

ఓ సంవత్సరం క్రితం మణిరత్నం, మహేష్, విజయ్ కాంబినేషన్లో సినిమా వార్తలు హాట్ న్యూస్ గా నిలిచాయి.. మరి హీరోల డేట్స్ వల్లనో ఏమో గాని అత్యంత భారీ సినిమా ఐనా కూడా మూలన పడేయాల్సి వచ్చింది. అయితే ఆ సినిమా ఆగిపోడానికి కారణం కేవలం బడ్జెట్ మాత్రమే అని ఆ సినిమా కథకు స్క్రీన్ ప్లే అందించిన జయమోహన్ రీసెంట్ గా తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అదో చారిత్రాత్మక సినిమా కాబట్టి తమిళనాడులో ఉన్న సుప్రసిద్ధ దేవాలయాల్లో ఆ సినిమా షూట్ చేయాలని అనుకున్నారట.

కాని అక్కడ వారు షూటింగ్ కు అనుమతులు ఇవ్వడం కష్టమని తెలియడంతో ఆ సినిమా ఆలోచనని వెనక్కి తీసుకున్నారట. ఇక ఆ దేవలయాల సెట్స్ వేయాలంటే అవే దాదాపు 50 కోట్ల దాకా పట్టొచ్చని అంచనా వేశారట. స్టార్ రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి ఆ సినిమా బడ్జెట్ దాదాపు 200 కోట్ల పైమాటే.. ఇక ఈ పరిస్థితుల్లో అంత బడ్జెట్ పెట్టడం కష్టం కనుక ఆ సినిమాను తెరకెక్కించలేదని అన్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాకా వచ్చిన సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఒకవేళ అంత బడ్జెట్ ఎవరైనా పెట్టేందుకు సిద్ధమైతే కనుక, ఆ సినిమా తప్పకుండా తీసే ఆలోచనలోనే ఉన్నాడట మణిరత్నం.