శ్రీదేవి తర్వాత లావణ్యకే ఆ క్రెడిట్..!

అక్కినేని ఫ్యామిలీలో హీరోయిన్స్ హవా ఎక్కువగా ఉంటుంది. ఏయన్నార్ కాలం నుండి నాగ చైతన్య వరకు తమతో పాటు సరితూగే పాత్రల్లో హీరోయిన్స్ ను సెలెక్ట్ చేస్తుంటారు, వారు ఎంచుకునే కథలు కూడా అలానే ఉంటాయనుకోండి. అయితే ఏయన్నార్ తో నటించిన శ్రీదేవి ఆ తర్వాత తరం హీరో అయిన ఏయన్నార్ తనయుడు నాగార్జునతో కూడా నటించడం జరిగింది. కెరియర్ లో ఒకేసారి తండ్రి కొడుకులతో జోడి కట్టిన శ్రీదేవి, అప్పట్లో సూపర్ క్రేజ్ సంపాదించి అక్కినేని అభిమానులను అలరించింది. అయితే శ్రీదేవి తర్వాత ఏయన్నార్, నాగార్జునలతో కలిసి నటించిన హీరోయిన్ ఎవరూ లేరు.

ఇప్పుడు ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తూ తండ్రి నాగార్జునతో చేసిన హీరోయిన్ ఇప్పుడు తనయులతో చేసేందుకు రెడీ అవుతుంది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో నాగ్ సరసన నటించిన లావణ్య, ఇప్పుడు ఆ సినిమా డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా చేస్తున్న నిన్నే పెళ్లాడతాలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అక్కినేని ఫ్యామిలీలో తండ్రి కొడుకులతో నటించిన హీరోయిన్ గా అప్పట్లో శ్రీదేవి ఆ క్రెడిట్ సాధించగా ఇప్పుడు అదే తరహాలో నాగార్జునతో జోడి కట్టిన లావణ్య త్రిపాటి, నాగచైతన్యతో కూడా కలిసి నటించి మళ్లీ ఆ క్రెడిట్ దక్కించుకుంది.

ప్రస్తుతం ఉన్న యువ హీరోయిన్స్ లో అందంతో పాటు అభినయం కూడా కలగలిపి లావణ్య దర్శక నిర్మాతలకు బెస్ట్ ఆప్షన్ అయ్యింది. కుర్ర హీరోల సినిమాలకు ఆమె మొదటి స్క్రీనింగ్ లో ఉంటుంది. రీసెంట్ గా అల్లు శిరీష్ తో నటించిన శ్రీరస్తు శుభమస్తు హిట్ కొట్టడంతో మరింత ఉత్సాహంతో అమ్మడు వరుస సినిమాలు చేసేస్తుంది. మరి అక్కినేని ఫ్యామిలీలో శ్రీదేవి తర్వాత అంతటి గొప్ప అదృష్టాన్ని దక్కించుకున్న లావణ్య కెరియర్ ఇంకెంత కలర్ఫుల్ గా కొనసాగుతుందో చూడాలి.