
మాస్ మహారాజ రవితేజ నటించిన బెంగాల్ టైగర్ 2015లో విడుదలైంది. బెంగాల్ టైగర్ కలెక్షన్ల పరంగా చూసుకొంటే రవితేజకి చాలా సంతృప్తి కలిగించిన చిత్రమేనని చెప్పవచ్చు. దాని పెట్టుబడికి రెట్టింపు వసూళ్లు సాధించగలిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు రవితేజ ఒక్క సినిమా కూడా చేయలేదు. చాలా కధలు విన్నప్పటికీ ఏదీ సంతృప్తి కలిగించలేదట! అందుకే ఇంత ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. చివరికి వక్కంతం వంశీ చెప్పిన కధ నచ్చడంతో దానిని ఓకే చేసేసాడు. నిజానికి ఆ కధని ఆయన జూ.ఎన్టీఆర్ కోసం రాసుకొన్నా, ఆయన్ని కలవడం వీలుపడకపోవడంతో రవితేజకి ఆ కధ వినిపిస్తే ఆయన చాలా థ్రిల్ అయిపోయి వెంటనే ఓకే చేసేసారట. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే అప్పుడు ఆ కధని వదులుకొన్నందుకు జూ.ఎన్టీఆర్ బాగా బాధపడతారేమో?
కధ దొరికిన తరువాత దర్శకుడు కోసం వెతుకులాట మొదలుపెట్టి విక్రం సిరిని ఫైనల్ చేసేశాడు. విక్రమ్ సిరి రేసు గుర్రం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలకి కధ, స్క్రీన్ ప్లే అందించాడు. వాటిలో రెండవ సినిమాకి నంది అవార్డు కూడా అందుకొన్నాడు. ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. రచయితలు, దర్శకులుగా మారి తీసిన చాలా సినిమాలు హిట్ అయ్యాయి. కనుక ఆ లెక్కన ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అయ్యే అవకాశం ఉంది.
రవితేజకి మంచి కధ, మంచి దర్శకుడు దొరికారు కనుక త్వరలోనే సినిమా షూటింగ్ మొదలుపెట్టవచ్చు. ఇక రవితేజ పక్కన నటించడానికి తగిన హీరోయిన్, మిగిలిన నటీనటులని ఇంకా ఎంపిక చేసుకోవలసి ఉంది. ఈ సినిమాని నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జీ), తెదేపా నేత వల్లభనేని వంశీ కలిసి శ్రీ లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నారు. ఈ సినిమా రవితేజ్ మార్క్ యాక్షన్, కామెడీతో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.