
జూ.ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమా ఈరోజే విడుదలయింది. ఎన్టీఆర్ అభిమానులు మొదటి షోలోనే ఆ సినిమాని చూసేయడం పెద్ద వింతేమీ కాదు. కానీ బాహుబలి వంటి భారీ సినిమాలు నిర్మించి గొప్ప పేరు తెచ్చుకొన్న దర్శకుడు రాజమౌళి కూడా చూసేశారు. ఒకటి కాదు వరుసగా రెండు షోలు చూసి మరీ థియేటర్ నుంచి బయటకి వచ్చారు! అది చూసి జూ.ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. రాజమౌళికి జనతా గ్యారేజ్ అంతగా నచ్చినందుకు వారు చాలా సంతోషపడుతున్నారు. ఇక తమ అభిమాన హీరో సినిమాకి తిరుగులేదని గట్టిగా నమ్ముతున్నారు.
ఈ సినిమాని చూసి వచ్చిన తరువాత రాజమౌళి దానిలో ప్రధాన పాత్రలు పోషించిన జూ.ఎన్టీఆర్, మోహన్ లాల్ ని అభినందిస్తూ, “ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్, మోహన్ లాల్ కాంబినేషన్ చాలా చక్కాగా కుదిరింది. వారిద్దరూ చాలా అద్భుతంగా నటించారు. వారి నటన నాకు చాలా నచ్చింది. టెంపర్ సినిమా తరువాత జూ.ఎన్టీఆర్ చాలా మంచి పాత్రలు ఎంచుకొంటూ తన కెరీర్ ని చక్కగా మలుచుకొంటున్నాడు. అతని ఎదుగుదలని చూస్తుంటే నాకు చాలా సంతోషం, గర్వం కలుగుతోంది. ఈ సినిమాలో రాజీవ్ కనకాల నటన మనసులని తాకేలా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా నాకు చాలా నచ్చింది. అందుకే వరుసగా రెండుసార్లు చూశాను,” అని ట్వీట్ చేశారు.            
సినీ పరిశ్రమలో విపరీతమైన పోటీ, ఈర్ష్యా, అసూయ, ద్వేషాలు చాలా ఎక్కువగా ఉంటాయని వింటూ ఉంటాము. కొందరు సీనియర్ దర్శకులు, జూనియర్ హీరోలు మాటలు విన్నప్పుడు అది నిజమేననిపిస్తుంది. కానీ ఎక్కడా అపజయం అన్నది ఎరుగని దర్శకుడు రాజమౌళి జూ.ఎన్టీఆర్ మీద అభిమానంతో వేరే దర్శకుడు (కొరటాల శివ) తీసిన సినిమా రిలీజ్ అయిన రోజే వరుసగా రెండుసార్లు సినిమాని చూసి ఈ విధంగా మెచ్చుకోవడం చాలా గొప్ప విషయమే.  
టెంపర్, నాన్నకు ప్రేమతో వరుసగా రెండు హిట్లు అందించిన జూ.ఎన్టీఆర్ కి ఈ సినిమా కూడా హిట్ అయ్యింది కనుక ఇది ఆయనకీ హ్యాట్రిక్ సినిమా అవుతుంది. అలాగే మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో రెండు హిట్స్ అందించిన దర్శకుడు కొరటాల శివకి కూడా ఇది హ్యాట్రిక్ అవుతుంది. హీరో, దర్శకులకి ఒకే సినిమాతో హ్యాట్రిక్ సాధించడం కూడా గొప్ప విషయమే.