నా వయసుకి దాన్ని హ్యాండిల్ చేయలేకపోయాను- జూ.ఎన్టీఆర్

‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో మళ్ళీ సక్సెస్ బాట పట్టిన జూ.ఎన్టీఆర్ రేపు విడుదల కాబోతున్న ‘జనతా గ్యారేజ్’ పై చాలా ఆశలు పెట్టుకొన్నాడు. ఇంతవరకు జూ.ఎన్టీఆర్ 25 సినిమాలు చేశాడు. అయినా మొదటిసారి చేసిన సినిమా విడుదలవుతుంటే ఏ విధంగా ఆందోళన, భయం, ఖంగారు, ఉత్కంఠ ఉంటుందో ఇప్పుడూ అలాగే ఉందని చెప్పడం విశేషం. జనతా గ్యారేజ్ రిలీజ్ సందర్భంగా జూ.ఎన్టీఆర్ మీడియాకి నిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాటలలో చాలా పరిపక్వత కనబడుతోంది. వ్యక్తిగత జీవితం మొదలు తెదేపా రాజకీయాల వరకు అన్ని విషయాలపై చాలా చక్కగా అభిప్రాయలు చెప్పారు.

తన సినిమాలు, స్టార్ డమ్ గురించి జూ.ఎన్టీఆర్ చెప్పిన మాటలు చాలా ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. “మేమేదో గొప్ప స్టార్లమని, మాకు నచ్చినట్లుగానే సినిమాలు తీస్తామని లేదా మేము చాలా కష్టపడి సినిమా తీశాము కనుక అది ఎలాగున్నా వాటినే మీరు చూడాలి అని అంటే కుదరదు. ప్రేక్షకులు మొట్టికాయలు వేస్తారు. నేను ‘సింహాద్రి’తోనే విజయం అందుకొన్నాను కానీ అప్పటికి నా వయసు కూడా తక్కువే అందుకే ఆ విజయాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేక ఎదురుదెబ్బలు తిన్నాను. వాటి నుంచి చాలా గుణపాఠాలు నేర్చుకొన్నాను.”

“మనల్ని మనం నిరూపించుకోవాలి. అందుకు తగిన కధలని ఎంచుకోవాలి. ఆ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించాలి. అప్పుడే మనల్ని హీరోలుగా గుర్తిస్తారు. అందుకే ఇప్పుడు నా ప్రతిభని నిరూపించుకొనేందుకు మంచి కధా బలం, నటనకి ఆస్కారం ఉన్న సినిమాలు చేయాలనే ప్రయత్నిస్తుంటాను. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలు అటువంటివే. ఈ సినిమాలో మా స్టార్ డమ్ కనబడదు. మా పాత్రలు మాత్రమే కనబడతాయి. సుమారు రెండేళ్లుగా ఈ సినిమా కధ నన్ను వెంటాడుతూనే ఉంది. అందుకే చేశాను,” అని జూ.ఎన్టీఆర్ చెప్పారు.

“జీవితంలో సంతృప్తి చాలా ముఖ్యం. అది నాకు ఉంది. కనుకనే ఈ జయాపజయాల గురించి ఇదివరకు లాగా బాధపడటం లేదు. కానీ మా కష్టం వృధా కాకూడదు. ప్రేక్షకులకి మా సినిమాలు నచ్చితే చాలని అనుకొంటుంటాము. అందుకే సినిమా రిలీజ్ కి ముందు కొంచెం టెన్షన్ కలుగుతుంటుంది. కానీ ఈ నెంబర్ల గోల, కలెక్షన్ల గోల వలన చాలా ఒత్తిడికి గురవుతుంటాము. ఒక్కోసారి ఆ ఒత్తిడి భరించలేక బాగా డబ్బులు వచ్చే సినిమాలే చేస్తే బాగుంటుందేమోననే ఆలోచనలు కూడా వస్తుంటాయి. కానీ మన ప్రతిభని నిరూపించుకోవాలంటే మంచి సినిమాలు చేయడం చాలా అవసరం అని ఇటువంటి వాటిని ఎంచుకొని చేస్తుంటాను,” అని జూ.ఎన్టీఆర్ అన్నారు.

తెలుగుదేశం పార్టీతో తన అనుబంధం గురించి జూ.ఎన్టీఆర్ చాలా సున్నితంగా స్పందించారు. “టిడిపితో నాకున్న అనుబంధం గురించి చాలాసార్లు చెప్పాను. కానీ పదేపదే వివరణ ఇచ్చుకోవలసిరావడంతో విసుగొస్తోంది. అయినా పార్టీకి నా అవసరం ఉందని చెప్పినప్పుడు వెళ్లి నా బాధ్యతని నిర్వర్తించాను. ఇప్పుడు ఆ అవసరం లేదు కనుక నా సినిమాలు, నా కుటుంబం, కొడుకు అభయ్ లతోనే నాకు సరిపోతోంది, “ అని జూ.ఎన్టీఆర్ అన్నారు.