
మూడు రోజుల క్రితం కర్నాటకలోని కోలార్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులకి, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి మధ్య జరిగిన ఘర్షణలో తిరుపతికి చెందిన వినోద్ అనే పవన్ కళ్యాణ్ అభిమాని మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అతని కుటుంబ సభ్యులని ఈరోజు పవన్ కళ్యాణ్ కలిసి పరామర్శించారు.
అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ, “సినీ పరిశ్రమలో తోటి హీరోలతో నేనెప్పుడు గొడవ పడలేదు. అందరం స్నేహంగానే ఉంటాము. మా మధ్య పోటీతత్వం ఉంటుందే కానీ గొడవలు పడము. కానీ మా కోసం అభిమానులే గొడవ పడుతుంటారు. అభిమానం ఉండొచ్చు కానీ అది హద్దులు దాటి, హింసకి దారి తీయకూడదు. ఒకరినొకరు చంపుకొనే స్థాయికి వెళ్ళడం అసలే మంచిది కాదు. మరో రెండు నెలలో అమెరికాకి వెళ్ళవలసిన వినోద్ హత్యకి గురవడం చాలా బాధ కలిగిస్తోంది. ఇటువంటి నేరానికి పాల్పడిన వ్యక్తిని చట్ట ప్రకారం శిక్షించవలసిందే. వినోద్ కుటుంబానికి నేను అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
గత ఏడాది పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో పవన్ కళ్యాణ్, ప్రభాస్ అభిమానుల మధ్య ఘర్షణలు జరిగాయి. అప్పుడు చాలా ఆస్థి నష్టం జరిగింది. ఈసారి కోలార్ లో జరిగిన ఘర్షణలలో ఒక అభిమాని ప్రాణాలే కోల్పోయాడు. అందుకు ఇద్దరు హీరోలు ప్రజల ముందు తలదించుకొనే పరిస్థితి ఏర్పడింది.
ఈ ఘర్షణలలో ఒక హీరో అభిమాని ప్రాణాలు కోల్పోతే, మరొక హీరో అభిమాని హత్యానేరం క్రింద జైలుకి వెళ్ళవలసి వస్తోంది. ఇది క్షణికావేశంలో జరిగిన ఘటనే అయినప్పటికీ దాని వలన రెండు కుటుంబాలకి తీరని శోకం, కష్టాలు మిగిలాయి. ఈ ఘర్షణలతో పవన్ కళ్యాణ్ కి సంబంధం ఏమీ లేకపోయినప్పటికీ, తన షూటింగ్ కార్యక్రమాలని మానుకొని తిరుపతి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారి ముందు తలదించుకొని నిలబడవలసి వస్తోంది. ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ కొంత ఆర్ధిక సహాయం చేయగలరేమో కానీ పోయిన మనిషిని తిరిగి తీసుకువచ్చి ఇవ్వలేరు. వారి బాధని తుడిచివేయలేరని అభిమానులకి కూడా తెలుసు.
అభిమానం అనేది వ్యక్తిగత విషయమే కానీ దానిని సామాజికం చేసినప్పుడే ఇటువంటి సమస్యలు ఎదురవుతుంటాయి. సామాజికం చేసినప్పటికీ, దానిని ఒక సమిష్టి, సానుకూల శక్తిగా మలుచుకోగలిగితే, అది వారికీ, వారు అభిమానిస్తున్న హీరోలకి కూడా గొప్పపేరు తెస్తుంది. ఈ విషయంలో చిరంజీవి అభిమానులని ఆదర్శంగా తీసుకోవచ్చు. వారు తమ హీరోపై ఉన్న అభిమానాన్ని, తమ  సమిష్టి శక్తిని రక్తదానం, నేత్రదానం, పేద విద్యార్ధులకి సహాయపడటం వంటి మంచి పనుల ద్వారా వ్యక్తం చేస్తుంటారు.
పవన్ కళ్యాణ్, వేరే హీరో అభిమానులు కూడా అటువంటి మంచి పనులు చేస్తున్నప్పటికీ, కడివెడు పాలలో చిటికెడు విషం కలిస్తే ఏమవుతుందో అదే విధంగా ఆవేశంతో చేసిన ఒక క్షమార్హం కాని తప్పు చేసి వారు ఇబ్బందులలో పడ్డారు, తమ హీరోలని కూడా ఇబ్బందికర పరిస్థితులలో నిలబెట్టారు. అభిమానం దురాభిమానం కానంతవరకు ఎవరికీ ఇబ్బంది ఉండదు ఎవరూ ఆక్షేపించరు. అది హద్దులు దాటినప్పుడే ఇటువంటి దుస్థితి, విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది.